సరిహద్దుల్లో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో అమరులైన 20 మంది భారత సైనికులకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నివాళి అర్పించింది. భోజన విరామం తర్వాత ప్రారంభమైన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

20 మంది సైనికులు మరణించారన్న వార్త తనను కలచివేసిందని జగన్ అన్నారు. అమర వీరుల్లో మన సోదర రాష్ట్రం తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా మరణించారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:పుట్టిన బిడ్డ ముఖం కూడా చూడకుండానే..

భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే విధిలో భాగంగా ఇండో- చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో అమరులైన 20 మంది వీర సైనికులకు రాష్ట్ర ప్రజల తరపున అసెంబ్లీ ఘనమైన నివాళి అర్పిస్తుందని ముఖ్యమంత్రి సంతాప సందేశాన్ని చదివి వినిపించారు.

దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సైనికుల కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతిని తెలుపుతుందని జగన్ అన్నారు. తెలుగువాడు, పక్క రాష్ట్రం, సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలకు గుర్తుండిపోతుందని ఆయన ఆకాంక్షించారు.

Also Read:అమరుడైన కల్నల్ సంతోష్ బాబు తల్లితో చెప్పిన చివరి మాటలు...

వీర మరణం పొందిన మన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని ముఖ్యమంత్రి భగవంతుణ్ణి ప్రార్ధించారు. అనంతరం అమరవీరులకు నివాళి అర్పిస్తూ 3 నిమిషాల పాటు శాసనసభ మౌనం పాటించింది.