అమరావతి: ఏపీలో కింగ్ ఎవరో మరికొన్ని గంటల్లో తేలుపోతుంది. దాదాపు 45 రోజుల క్రితం ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు రేపు బహిర్గతం కాబోతుంది. నువ్వా నేనా అన్న రీతిలో జరిగిన ఎన్నికల సమరంలో ఓటర్లు ఎవరికి మెుగ్గు చూపారు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. 

నరాలు తెగే ఉత్కంఠకు తెరదించేలా ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 11న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజేత ఎవరో అనేది గురువారం తెలియనుంది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. 

గురువారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకాగానే తొలుత పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్లు లెక్కించి అనంతరం ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నారు. మధ్యాహ్నాం 12 గంటలకు ఫలితాల ట్రెండ్స్ తేలిపోనుంది. 

ఈవీఎంల కౌంటింగ్ అనంతరం వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు తర్వాతే ఫలితం ప్రకటించనుంది. అయితే ఫలితాలు వెల్లడికి రాత్రి అయ్యే అకాశం  కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 36 కౌంటింగ్‌ కేంద్రాల్లో సుమారు 350 లెక్కింపు హాళ్లు ఏర్పాటు చేసింది. 

ప్రతి అసెంబ్లీ స్థానానికి ఒక పరిశీలకుడు, పార్లమెంట్‌ స్థానానికి మరో పరిశీలకుడు ఉంటారని తెలిపారు. రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల ఆధ్వర్యంలో లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఓట్ల లెక్కింపులో 25వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. 

ఇప్పటికే ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, రిటర్నింగ్‌ అధికారులు, పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కౌంటింగ్ ఏర్పాట్లపై ఆరా తీసింది. అలాగే రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియ సరళిని పరిశీలించేందుకు కేంద్రం నియమించిన ఇద్దరు పరిశీలకులు పర్యవేక్షించనున్నారు. 

కౌంటింగ్ సందర్భంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం నుంచి వాహనాలను నిలిపివేస్తారు. చివరి అంచెలో సీపీఎంఎఫ్‌ బలగాలను పెడతామని సిఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 

ఈ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మొత్తం 25వేల మంది పోలీసు బలగాలను మోహరిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే 35 కంపెనీల సీపీఎంఎఫ్‌ బలగాలు, పది కంపెనీల బలగాలను కేంద్రం పంపింది. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతి  నిరాకరించారు. 

ఈవీఎంలలో సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రతి కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద ఇద్దరు బెల్‌ ఇంజినీర్లను ఏర్పాటు చేశారు సిఈవో. ఈ ఎన్నికల్లో 3లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు, 28వేల సర్వీస్‌ ఓట్లు జారీచేశారు. ఎన్నికల ఫలితాలను ఇ-సువిధ యాప్‌, ఈసీఐ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసేలా అవకాశం కల్పించింది ఈసీ. 

వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కింపు అనంతరం తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు కోసం వీవీప్యాట్లను లాటరీ తీసి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు వేర్వేరుగా ఎంపిక చేస్తామన్నారు. 

ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కిస్తామని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు చాలా వరకు ఫలితాలు తెలిసిపోయే అవకాశం ఉందన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల్ని లెక్కించాక బహుశా రాత్రి వరకు ఈసీఐ అనుమతి తీసుకొని ఫలితాన్ని ప్రకటిస్తామన్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తొలి ఫలితం వెల్లడికానుంది. 13 రౌండ్స్‌లో నర్సాపురం అసెంబ్లీ కౌంటింగ్ పూర్తికానుంది. చివరి ఫలితంగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వెల్లడికానుంది. 36 రౌండ్స్‌లో రంపచోడవరం అసెంబ్లీ ఫలితం వెల్లడి కానుంది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన మధ్య రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.