ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యలు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులు.. ప్రసంగం కొనసాగుతుండగానే సభలో నుంచి వెళ్లిపోయారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యలు వాకౌట్ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగం మొదలుపెట్టారు. గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టిన తర్వాత.. రాజ్యాంగాన్ని గవర్నర్ గో బ్యాక్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించేశారు. టీడీపీ సభ్యులు నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

సభలో గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన టీడీపీ సభ్యులు.. కొద్దిసేపటికి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వారు సభలో నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత తిరిగి వెళ్లే దారిలో టీడీపీ సభ్యులను వెళ్లనీయకుండా మర్షల్స్ అడ్డుకున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు. తర్వాత అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యులు బైఠాయించారు.

ఈ సందర్బంగా శాసనమండలికి కూడా వెళ్లకుండా అడ్డుకుంటారా అంటూ నారా లోకేష్ మండిపడ్డారు. సభలో మాట్లాడనివ్వడం లేదని.. కనీసం లాబీల్లో కూడా ఉండనివ్వరా అంటూ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగులుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు. ఎమ్మెల్సీలు బీటెక్ రవితో పాటు మరో ఎమ్మెల్సీని బయటకు పంపారు. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యులకు, మార్షల్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.