ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లు సెలక్ట్ కమిటీకి పంపే అంశంపై సందిగ్థత నెలకొనడంతో ప్రభుత్వం అడ్వకేట్ జనరల్‌ను శాసనమండలికి పిలిచింది. ఎట్టి పరిస్ధితుల్లోనూ బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లకూడదని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.

ఈ మేరకు మంత్రులతో సమావేశమైన అడ్వొకేట్ జనరల్ న్యాయపరమైన అంశాలపై సలహాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో మండలిలో ఛైర్మన్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఛైర్మన్ అధికార, ప్రతిపక్షాలను కోరారు.

Also Read:మూడు రాజధానులు: కోర్టుల్లోనూ తేల్చుకునేందుకు.. జగన్ ఎత్తుగడ

బిల్లును చర్చకు తీసుకున్న సమయంలో సాంకేతిక మోషన్ మూవ్ కాలేదని ఛైర్మన్ ప్రకటించిన ఆయన మోషన్ మూవ్ అయితేనే నిర్ణయం తీసుకోగలమని తెలిపారు. ఛైర్మన్‌తో మంత్రులు పిల్లి, బుగ్గన, బొత్స, మంతనాలు జరుపుతున్నారు.

బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడానికి నిబంధనల ప్రకారం కుదరదని, అందుకు ఎలాంటి అవసరం లేదని బుగ్గన తేల్చి చెప్పారు. అదే సమయంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు.. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామన్నారు.

బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని ముందే నోటీసులిచ్చామని.. నిబంధనలకు విరుద్ధంగా ఒకే రోజు బిల్లు పెట్టి చర్చ జరిపి ఓటింగ్ పెట్టుకున్నా.. వైసీపీ నుంచి మేం రూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

Also Read:శాసనమండలిలో ఉద్రిక్తత: టీడీపీ, వైసీపీ మధ్య వాగ్వాదం, గ్యాలరీలో బాబు

ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటులో నాన్ ఫైనాన్స్ బిల్లుగా పెట్టి.. ఆ తర్వాత ఫైనాన్స్ బిల్లుగా ఏ నిబంధన ప్రకారం మార్చారని యనమల ప్రశ్నించారు. మండలిలో మెజార్టీ ఉన్న మేం అడిగితే సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందేనని, కావాలంటే ఓటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకోవచ్చునని రామకృష్ణుడు సూచించారు.

ఈ విషయంలో చైర్మన్ కు పూర్తి అధికారాలు ఉన్నాయని.. సభలో మెజార్టీ సభ్యులు ఏం కోరుకుంటే చైర్మన్ అదే చేస్తారన్నారు. ఓటింగ్ సమయంలో సభ్యులు కానివారిని బయటకు పంపాలని యనమల డిమాండ్ చేశారు.