సీఎం వైఎస్ జగన్‌ని అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కలిశారు. ఈ సందర్భంగా అధికార భాషా సంఘం వార్షిక నివేదికను సీఎంకు అందజేశారు యార్లగడ్డ. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు అధికార భాషా సంఘమే లేదని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక దాన్ని ఏర్పాటు చేశారని లక్ష్మీప్రసాద్ ప్రశంసించారు. అధికారిక కార్యకలాపాల్లో తెలుగు బాష అమలుపై పర్యవేక్షణ చేయమని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు.

Also Read:ఏపీలో పడిపోతున్న కరోనా కేసులు: కొత్తగా 8,766 మందికి పాజిటివ్.. చిత్తూరులో భయపెడుతున్న మరణాలు

తాము ఈ కోవిడ్ సమయంలోనూ అన్ని జిల్లాలు తిరిగామని.. సచివాలయ స్థాయిలో తెలుగు భాష అమలు సరిగ్గా జరగడం లేదని యార్లగడ్డ అంగీకరించారు. 12 ఏళ్ల తర్వాత సీఎం వైఎస్ జగన్ కి వార్షిక నివేదిక ఇచ్చామని.. రాబోయే రోజుల్లో ఉద్యోగులకు శిక్షణ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలుగును పాలనా భాషగా అమలు చేయడానికి పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారని లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. అలాగే అధికార భాషా సంఘం తరపున కోవిడ్ సహాయ నిధికి 5 లక్షలు విరాళం అందించినట్లు యార్లగడ్డ స్పష్టం చేశారు.