కోదాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని కోదాడలో ఏసీబీ అధికారులు విచారణ చేశారు. ఈఎస్ఐ మందుల సరఫరా కుంభకోణంలో కోదాడకు చెందిన యువకుడికి సంబంధం ఉందని ఏసీబీ గుర్తించింది. 

ఆదివారం నాడు ఏపీకి చెందిన ఏసీబీ అధికారులు కోదాడలో ఆ యువకుడిని రహస్యంగా విచారించినట్టుగా తెలుస్తోంది. కోదాడకు చెందిన ప్రమోద్ రెడ్డి ఈఎస్ఐ స్కాంలో ఉన్నట్టుగా గుర్తించారు. ఈ కేసులో అతను ఏ 3 నిందితుడిగా ఏసీబీ చేర్చింది.

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న టెలీహెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి డైరెక్టర్‌గా ప్రమోద్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ కుంభకో ణంలో ఏ–1 నిందితుడిగా ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ రమేష్‌కుమార్‌ను, ఏ–2గా ఉన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

దీంతో ప్రమోద్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతను సెల్‌ స్విచ్‌   ఆఫ్‌ చేయడంతో ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.అతని బంధువులు, స్నేహితులు ఎవరో ఆరా తీశారు. అతడి స్వగ్రామమైన అనంతగిరి మండలంలో కూడా విచారణ చేసి అక్కడ నిఘా పెట్టినట్లు తెలి సింది.

ప్రమోద్ రెడ్డి గురించి కుటుంబసభ్యులను ఏసీబీ అధికారులు విచారించినట్టుగా సమాచారం. ఈ విషయమై లోతుగా ఏసీబీ విచారణ చేస్తోంది. ఈ కేసు ఏపీ రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది.