మూడు జిల్లాల్లో గెలవగానే ప్రజల మద్దతు తమకే ఉందని చెప్పుకున్న చంద్రబాబు, టిడిపి నేతలు, మరి ఐదు స్ధానాల్లో ఓటమి పాలైనందుకు ఏం చెబుతారో? బహుశా టిడిపిని ఓడించి ఓటర్లు తప్పు చేసారంటారేమో?

చంద్రబాబునాయుడుకు షాక్ తగిలింది. కడప, కర్నూలు, నెల్లూరు స్ధానిక సంస్ధల ఎంఎల్సీలను గెలుచుకున్న సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ఉపాధ్యాయ, పట్టభద్రుల స్ధానాలకు జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో ఒక్కదానిలో కూడా టిడిపి గెలవలేదు. మొత్తం ఐదు స్ధానాలకు జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్ధానాన్ని భాజపాకు కేటాయించి మిగిలిన నాలుగు స్ధానాల్లోనూ పోటీ చేసింది. అయితే, మొత్తం ఐదు స్ధానాల్లోనూ ఓడిపోయింది. పరిమితి ఓటర్లుండే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మూడింటిని ఏదోరకంగా గెలిచినా వేలాది ఓటర్లుండే పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో మాత్రం చతికిలపడటం గమనార్హం. అంటే ప్రజల్లో ఏమేరకు టిడిపిపై వ్యతిరేకత ఉందో అర్ధమవుతోంది.

స్ధానిక సంస్ధల ఓటర్లను గంపక్రింద కోడిపిల్లలాగ టిడిపి మ్యానేజ్ చేయగలిగినా వేలాది ఓటర్లుండే నియోజకవర్గాల్లో సాధ్యం కాలేదు. తూర్పురాయలసీమ (చిత్తూరు,నెల్లూరు,ప్రకాశం),పశ్చిమరాయలసీమ(అనంతపురం,కడప,కర్నూలు)ఎంఎల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గాలు రెండింటిలోనూ టిడిపి బోర్లాపడింది. ఇక్కడ పిడిఎఫ్ అభ్యర్ధి విఠపు బాలసుబ్రమణ్యం, కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు.

ఇక, ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎంఎల్సీ నియోజకవర్గాల ఓట్ల కౌటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. తాజా సమాచారం మేరకు ఈ స్ధానాల్లోనూ టిడిపి బాగా వెనకబడే ఉంది. ఈ ఎన్నికల్లో జనాల్లో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టమవుతోంది. పైగా చంద్రబాబు స్వంత జిల్లా అయిన చిత్తూరులో కూడా టిడిపికి పెద్దగా ఓట్లు రాలేదు. ఒకవిధంగా పట్టభద్రులైనా, ఉపాధ్యాయ నియోజకవర్గాలైనా ఎక్కువగా మధ్య తరగతి ఓటర్లుంటారు. అంటే, వారెవరూ చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతుగా నిలవలేదని స్పష్టమవుతోంది.

స్ధానిక సంస్ధల నియోజకవర్గాలంటే పరిమిత సంఖ్యలో ఓటర్లుంటారు కాబట్టి టిడిపి ప్రలోభాలు, ఒత్తిళ్లు పనిచేసాయి. అదే, వేలాది ఓట్లుండే నియోజకవర్గాల్లో టిడిపి ఎత్తులు ఎక్కడా పారలేదన్నది స్పష్టం. మూడు జిల్లాల్లో గెలవగానే ప్రజల మద్దతు తమకే ఉందని చెప్పుకున్న చంద్రబాబు, టిడిపి నేతలు, మరి ఐదు స్ధానాల్లో ఓటమి పాలైనందుకు ఏం చెబుతారో? బహుశా టిడిపిని ఓడించి ఓటర్లు తప్పు చేసారంటారేమో?