గుంటూరు: ఏపీలోని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్దమయిన ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని... అంతేకాకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసే సంఘటనలు అనేకం జరుగుతున్నాయని ఆరోపించారు. అయినా వైసిపి ప్రభుత్వం స్పందించకపోవడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

''హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. దేవతా విగ్రహాల ధ్వంసం, రధాలకి నిప్పు, పూజారులపై దాడులు, ఆలయ భూముల అమ్మకం, గోశాల‌ల్లో గోవుల‌ మృత్యుఘోష.ఇప్పుడు తాజాగా అర‌వై ఏళ్లుగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి క‌ళ్యాణోత్స‌వానికి ఉప‌యోగించిన‌ ర‌థం ద‌గ్ధం కావ‌డంతో హిందువుల మ‌నోభావాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి'' అని లోకేష్ మండిపడ్డారు. 

read more   ప్రధాని మోదీ, పొరుగు రాష్ట్రం సీఎం సైతం...మరి జగన్ ఎందుకిలా: చంద్రబాబు ఆగ్రహం

''నిత్యం జరుగుతున్న ఈ ఘటనలు రాష్ట్రానికి అరిష్టం అని పండితులు పదే పదే చెబుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. మతి స్థిమితం లేని వ్యక్తి చేసాడని ఓసారి, షార్ట్ సర్క్యూట్ అని, తేనే తీగలు అని,పేకాట ఆడే బ్యాచ్ వలన ప్రమాదం జరిగింది మరోసారి బాధ్యతా రాహిత్యంగా దేవాదాయ శాఖ మంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడటం, సీఎం జగన్ రెడ్డి అసలు ఈ ఘటనలు గురించి స్పందించకపోవడం హిందువుల్లో అనేక అనుమానాలకు తావిస్తున్నాయి'' అని పేర్కొన్నారు. 

''హిందూ ఆలయాలు, ధార్మిక సంస్థలపై జరుగుతున్న దాడులను ప్రశ్నించినందుకు హిందూ సంఘాల ప్రతినిధులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణయే వారిని విడుదల చెయ్యాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు. 

''ఇప్పటివరకు ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చు రాజేస్తున్న వారే ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. 
రథం దగ్ధం ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. ఈ ఘటనల వెనుక ఉన్న ముఖ్య పాత్రధారులు ఎవరో బయటపడాలి. వరుస ఘటనలకు కారణమైన వారు ఎంత పెద్ద వారైనా కఠినంగా శిక్షించాలి'' అని లోకేష్ వైసిపి ప్రభుత్వానికి సూచించారు.