వైసిపిలోకి త్వరలో మరో పారిశ్రామికవేత్త రీ ఎంట్రీ ఉంటుందట. ఇటీవలే నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపిలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. అదే దారిలో పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రఘురామ కృష్ణంరాజు వైసిపిలోకి రీ ఎంట్రీ ఖాయమని వైసిపి వర్గాలంటున్నాయి. రాజుగారు రీ ఎంట్రీ కోసం వైసిపి నాయకత్వం నుండి హామీని పొందారట.

రాజుగారు ఒకపుడు వైసిపిలోనే ఉండేవారు. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంటు టిక్కెట్టు కోసం గట్టి ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే, అప్పటికే వేరొకరికి టిక్కెట్టు హామీ ఇచ్చిన వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి టిక్కెట్టు ఇవ్వలేనని తేల్చి చెప్పారు. దాంతో జగన్ పై అలిగిన రాజు వైసిపికి దూరమయ్యారు.

ఇంతలో బిజెపి నుండి ఆఫర్ వచ్చింది. వెంటనే రాజుగారు బిజెపిలో చేరి నరసాపురంకు పోటీ చేద్దామనుకున్నారు. బిజెపిలో చేరిన తర్వాత రాజుకు టిక్కెట్టు విషయంలో మొండిచెయ్యి ఎదురైంది. రాజు పరిస్ధితి రెంటికి చెడ్డ రేవడిగా తయారైంది. దాంతో చేసేది లేక అప్పటి నుండి రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు.

సీన్ కట్ చేస్తే మళ్ళీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈసారి వైసిపి నుండి ఎలాగైనా పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో రాజు గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారట. మళ్ళీ నరసాపురం పార్లమెంటు టిక్కెట్టే అడుగుతున్నారు. టిక్కెట్టు సాధించే ఉద్దేశ్యంతో ముందు నుండి పావులు కదుపుతున్నారట.

ఆర్ధికంగా మంచి స్ధితిమంతుడైన రాజు ఎన్నికల్లో ఖర్చు కోసం వెనకాడరన్న విషయం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైసిపికి కూడా ఆర్ధిక వనరుల అవసరం చాలా ఉంది. జగన్ నుండి తగిన హామీ కోసం ప్రయత్నిస్తున్నారు. జగన్ తో భేటీకి ఇద్దరికీ  కామన్ ఫ్రెండ్ ఒకరు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. భేటీలో రాజుగారికి జగన్ హామీ ఇస్తే వైసిపిలోకి రీ ఎంట్రీ అయిపోయినట్లే.