డిప్యూటీ సీఎం మరో కీలక నిర్ణయం.. కాలుష్యంపై కంప్లైంట్ చేయండిలా..
ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధితో పాటు అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్మాణాత్మక సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు. అలాగే, స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి పలు సూచనలు, అభిప్రాయాలు కూడా స్వీకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేయాలని సంబంధిత అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రజలు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలకు వెళ్లి తమ సమస్యలు తెలియచేసేందుకు, ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రతి రోజు 2 గంటల పాటు నిర్దేశిత సమయాన్ని ప్రకటించాలని ఆదేశాలు ఇచ్చారు.
మంగళగిరిలోని తన నివాసంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమావేశమైన పవన్ కళ్యాణ్... మండలి ప్రధాన కార్యాలయంతో పాటు రీజినల్, జోనల్ కార్యాలయాల్లోనూ ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు సమయం కేటాయించాలని స్పష్టం చేశారు. మండలి వెబ్‌సైట్‌లో రాష్ట్రంలో వాయు, జల, శబ్ద కాలుష్యాల వివరాలను ప్రజలకు అవగాహన కలిగించే విధంగా పొందుపరచాలని సూచించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్య ఫిర్యాదులు స్వీకరణ, సమస్యలు తెలుసుకొనేందుకు సమయం నిర్దేశిస్తామని మండలి సభ్య కార్యదర్శి బి.శ్రీధర్ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు వివరించారు.
కాగా, ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధితో పాటు అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్మాణాత్మక సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి పలు సూచనలు, అభిప్రాయాలు కూడా స్వీకరిస్తున్నారు. ఇటీవల మంగళగిరిలో పవన్ కళ్యాణ్ నివాసంలో ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, పర్యావరణ ప్రేమికుడు విజయ రామ్ కలిశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన వరి రకాలను ప్రదర్శించారు. అలాగే, కాలుష్య రహిత, పర్యావరణ హితమైన వస్తువులను తెలుగు వారి పండుగలు, వేడుకల్లో వాడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రానున్న వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజించి పర్యావరణానికి మేలు చేయాలన్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.