రఘురామకృష్ణంరాజు మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే సిఐడి కేసులకు సంబంధించి ఆయన బెయిల్ పై ఉన్నారు. ఇంతలో మరో ఫిర్యాదు ఆయనపై నమోదయింది. రెడ్డి సామాజిక వర్గాన్ని దూషించారు అంటూ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది.

ఇటీవల రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ రెడ్డి సామాజిక  వర్గాన్ని కించపరిచేలా పలు వ్యాఖ్యలు చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ మానవహక్కుల కమిషన్ కి ఓసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

రఘురామకృష్ణంరాజు మాట్లాడిన వీడియోలను సైతం ఫిర్యాదుకు జతచేశారు.  కరుణాకర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. దీనిపై త్వరలోనే రఘురామకి ఎన్‌హెచ్చార్సీ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.

కాగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రపన్నుతున్నారంటూ ఇటీవల రఘురామకృష్ణంరాజు పై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే విచారణ సందర్భంగా ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రఘురామ బెయిలుపై విడుదలయ్యారు. తాజాగా మరో సమస్య ఆయన్ని చుట్టుముట్టింది.