Asianet News TeluguAsianet News Telugu

ఎవరితో పొత్తు పెట్టుకున్నా... ఇంకెవరినో పెళ్లాడినా...: పవన్, చంద్రబాబుపై మజీమంత్రి అనిల్ సెటైర్లు

టిడిపి - జనసేన పొత్తుపై జరుగుతున్న ప్రచారం స్పందిస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పై  మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటైర్లు వేసారు. 

anil kumar yadav satires on chandrababu and pawan kalyan over tdp janasena alliance
Author
Nellore, First Published May 13, 2022, 3:56 PM IST

నెల్లూరు : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇటీవల ఇరుపార్టీల పొత్తు విషయంలో కీలక వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. 2014 ఎన్నికల్లో మాదిరిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసి పనిచేసేందుకు సిద్దంగా వున్నట్లు వారి మాటలను బట్టి తెలుస్తోంది. ఇలా టిడిపి-జనసేన పొత్తు ప్రచారంతో వైసిపిలో కలవరం మొదలయ్యింది. దీంతో వైసిపి నాయకులు చంద్రబాబు, పవన్ కలయికపై తీవ్రవ్యాఖ్యలు చేస్తున్నారు. 

తాజాగా మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ టిడిపి - జనసేన కలయికపై స్పందించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారో... ఎవరిని పెళ్లి చేసుకుంటారో  తమకు అనవసరమని అనిల్ సెటైర్లు వేసారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి చూసి వాళ్ళకి భయం పట్టుకుందని... వాళ్ల మీద వాళ్ళకి వ్యక్తిగతంగా నమ్మకం లేకే అందరూ ఒకటవ్వాలని కోరుకుంటున్నారని అన్నారు. దీన్ని బట్టే రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉన్నారో అర్థమవుతోందని అనిల్ పేర్కొన్నారు.

ఇక సీఎం జగన్ ఆదేశించినా ఇంకా తాను గడపగడపకు ఎమ్మెల్యే  కార్యక్రమాన్నిమొదలుపెట్టకపోవడంతో అనిల్ వివరణ ఇచ్చారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు...అందువల్లే ఈ  కార్యక్రమాన్ని మొదలుపెట్టి జనాల్లోకి వెళ్లలేకపోయానని అన్నారు. త్వరలోనే గడపగడపకు వెళ్లి వైసిపి ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తానని అన్నారు. 

తాను ప్రారంభించకుండానే గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమంలో తనను ముస్లింలు తరిమికొట్టారని టిడిపి, జనసేన అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. రెండున్నరేళ్ల క్రితం NRC వివాదం సమయంలో జరిగిన పాత వీడియోను తీసుకొచ్చి ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అనిల్ అన్నారు. బీజేపీకి తొత్తు జనసేన... అలాంటి జనసేనతో టిడిపి కలవాలనుకుంటుంది... దీన్ని బట్టే ఈ మూడు ఒకే కూటమని అర్థమవుతుంది. ఈ కూటమి ముస్లింల నుంచి వైసీపీ ని వేరు చేయాలని చూస్తోందని అనిల్ అన్నారు.  

పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతుంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ రాద్దాంతం చేస్తున్నారని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేసారు. టెన్త్ పేపర్ లీకేజీలో ఒకరు అప్రూవర్ గా మారి మాజీ మంత్రి నారాయణ పేరు బయటపెట్టారు కాబట్టే కేసు కట్టారు... తప్పుచేసిన వారిపై కేసు కడితే కక్షసాధింపు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. 

ఎవరితో పొత్తులు పెట్టుకున్నా, ఇంకేం చేసినా టిడిపి అధికారంలోకి రాలేదని... ఇంకో జన్మ ఎత్తినా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కాలేడని అనిల్ అన్నారు. అయినా ఈ 75 ఏళ్ళ వయసులో సీఎం అయి చంద్రబాబు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడు అని మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఎద్దేవా చేసారు. 

ఇదిలావుంటే ఇవాళ కోనసీమ జిల్లాలోని పోలవరం మండలం మూరమళ్లలో మత్స్యకార భరోసా కార్యక్రమంలో ప్రసంగిస్తూ చంద్రబాబు, పవన్ పై సీఎం జగన్  కూడా విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ప్రజలను నమ్ముకోకుండా కొడుకుని, దత్తపుత్రుడిని నమ్ముకున్నాడని ఎద్దేవా చేశారు.  రాజకీయాల్లో ఉన్న నేతలు జనాన్ని నమ్ముకోవాలి కానీ ఇలా నేతలను నమ్ముకొంటారా? అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు  ఇంత మంచి చేశామని చెప్పుకొనే ధైర్యం చంద్రబాబుకు కానీ ఆయన దత్తపుత్రుడికి కానీ ఉందా అని వైఎస్ జగన్ నిలదీశారు. తమ ప్రభుత్వం మంచి చేస్తుంటే దుష్ట చతుష్టయానికి నచ్చడం లేదని సీఎం చెప్పారు.  చివరకు రాష్ట్రానికి తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్న ఈ రాబందులను ఏమనాలని జగన్ ప్రశ్నించారు. ఇలాంటి వారిని రాష్ట్ర ద్రోహులు అందామా, దేశ ద్రోహులు అందామా అని జగన్ ప్రజలను అడిగారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios