Asianet News TeluguAsianet News Telugu

డిసెంబర్ 7న విజ‌య‌వాడ‌లో వైఎస్‌ఆర్‌సీపీ 'జయహో బీసీ మహా సభ'

Vijayawada: బీసీ మంత్రులు, నేతలతో కలిసి పార్ల‌మెంట్ స‌భ్యులు విజయసాయి రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ బీసీ మ‌హాసభకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న సభకు దాదాపు 84 వేల మంది ప్రజాప్రతినిధులను ఆహ్వానించినట్లు ఎంపీ తెలిపారు.
 

Andhra Pradesh : YSRCP 'Jayaho BC Maha Sabha' at Vijayawada on December 7
Author
First Published Dec 2, 2022, 5:33 AM IST

YSRCP BC Mahasabha: డిసెంబరు 7న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 'జయహో బీసీ మహా సభ' నిర్వహించనున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. బీసీ మహాసభ పోస్టర్లను గురువారం ఆయన బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బుడ్డి ముత్యాలనాయుడు, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, మార్గాని బారత్, జంగా కృష్ణమూర్తి తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఉదయం 8 గంటలకు సభ ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మధ్యాహ్నం 12 గంటలకు కీలక ప్రసంగం చేయనున్నార‌ని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో మండలాల వారీగా, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా కూడా బీసీ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ బీసీలను వెన్నుదన్నుగా భావించి 50 శాతానికి పైగా నామినేటెడ్ పదవులు ఇచ్చారని ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అన్ని పదవుల్లోనూ బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చార‌ని అన్నారు. ఈ బీసీ మహా సభకు వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన 84 వేల మంది బీసీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బీసీలకు అండగా నిలిచారని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. బీసీ రిజర్వేషన్లు కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటులో ప్ర‌యివేటు బిల్లును ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీ వర్గాల ప్రజలందరి మద్దతుతో పార్టీ బీసీ సభను భారీ ఎత్తున నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, ఇతర బీసీ నాయకులు పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో పాల్గొన్నారు.

 

అలాగే, తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత‌ చంద్ర‌బాబుపై తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. "ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు మంచి చేస్తుంది. మా పార్టీకి గతంలో వచ్చిన ఓట్లు, సీట్లకంటే ఎక్కువ వస్తాయి. మళ్లీ మా పార్టీనే అధికారంలోకి వస్తుంది. శాంతి భద్రతలు బాగున్నాయి. ప్రజల్లో సానుభూతి కోసమే నన్ను చంపుతారు అంటూ చంద్రబాబు డ్రామాలు" అంటూ ట్వీట్ చేశారు. అంత‌కుముందు, విజయవాడలో ఈనెల 7న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే "వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయహో బీసీ-వెనుకబడిన కులాలే వెన్నెముక" సభా వేదిక ఏర్పాట్లను మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల్, కారుమూరి నాగేశ్వరరావు, అధికారులతో కలిసి విజ‌య‌సాయి రెడ్డి పరిశీలించారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios