Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూకుమ్మ‌డిగా మంత్రులు రాజీనామా చేశారు. తాజాగా జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశంలో 24 మంత్రులు త‌మ రాజీనామా ప‌త్రాలను అంద‌జేశారు. అయితే, కొత్త మంత్రులుగా ప్రామాణం స్వీకారం చేసే వారితో పాటు.. పాత‌వారిలో ఐదుగురు మంత్రులుగా కొన‌సాగ‌నున్నార‌ని స‌మాచారం.  

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూకుమ్మ‌డిగా మంత్రులు రాజీనామా చేశారు. గురువారం జ‌రిగిన క్యాబినెట్ సమావేశానికి రాజీనామా లేఖలతోనే వచ్చిన 24 మంత్రులు త‌మ రాజీనామా ప‌త్రాలను ముఖ్యమంత్రికి సమర్పించారు. మంత్రుల రాజీనామా లేఖలను జీఏడీ అధికారులు సాయంత్రం గవర్నర్ కు పంపనున్నారు. ఈనెల 10న కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కు సీఎం జగన్ పంపనున్నారు. ఈనెల 11న కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. అయితే, ప్ర‌స్తుతం రాజీనామా చేసిన వారిలో కొంత మంది మ‌ళ్లీ మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. వైకాపా నేత కొడ‌లి నాని సైతం మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం మంత్రుల్లో ఐదారుగురిని అనుభ‌వం రీత్యా కొన‌సాగించ‌నున్న‌ట్టు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చెప్పిన‌ట్టు వెల్ల‌డించారు. 

పేర్నితో పాటు కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌లో పార్టీలో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఐదారుగురు మంత్రుల గురించి వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. పాత వారి గురించి ఇలా ఉండ‌గా.. కొత్త‌గా మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోయే వారు వీరేనంటూ ప‌లువురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పూర్తిగా మంత్రులంద‌రిని మార్చాల‌ని భావించిన‌ప్ప‌టికీ.. కొన్ని సమీకరణల దృష్ట్యా కొందరిని కొనసాగించాలని తర్వాత నిర్ణయించారు. పదవి నుంచి తప్పుకునే కొందరు మంత్రులకు రీజినల్‌ ఇన్‌చార్జి పదవులు ఇవ్వనున్నారు. మిగిలిన వారికి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించి.. అసంతృప్తులు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోన్న‌ట్టు తెలిసింది. 

రాజకీయ, ప్రాంతీయ, సామాజికవర్గ సమీకరణాలను బ్యాలెన్స్‌ చేస్తూ కొత్త మంత్రుల ఎంపికపై ముఖ్య‌మంత్రి జగన్‌ కసరత్తు చేశారని తెలిసింది. మంత్రి పదవుల కోసం ఆశావహులు చాలామందే ఉన్న‌ప్ప‌టికీ.. ఆయా సామాజిక వ‌ర్గాలు, రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు దృష్టిలో ఉంచుకుని మంత్రిమండ‌లి కూర్పు ఉండ‌నుంద‌ని తెలిసింది. ప్రకాశం జిల్లా నుంచి ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌ మంత్రులుగా కొనసాగుతున్నారు. దీంతో ఇక్కడ ఎవరిని తీసుకుంటురన్న సందిగ్ధత నెలకొంది. అయితే, ప్ర‌స్తుత ప‌రిస్థితులు, రాజ‌కీయ ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకుని ఆదిమూల‌పు సురేష్ మంత్రిగా కొన‌సాగే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కొత్త మంత్రుల పేర్లలో వినిపిస్తున్న మ‌రోపేరు.. అప్ప‌ల‌రాజు. కొత్త మంత్రిగా ఆయ‌న కొన‌సాగ‌నున్నార‌ని స‌మాచారం. ఇక జగన్మోహ‌న్ రెడ్డి మొద‌టి క్యాబినెట్ ఏర్పాటు చేసినప్పుడు మంత్రి అయిన గుమ్మనూరు జయరాంతో పాటు మధ్యలో కేబినెట్ లో చేరిన మరో బీసీ మంత్రి వేణుగోపాలకృష్ణ కూడా తదుపరి కేబినెట్ లో కూడా కొనసాగే అవకాశాలున్న‌ట్టు తెలిసింది. గుంటూరు జిల్లా నుంచి పోటీ ఎక్కువగా ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు పేర్లు వినిపిస్తున్నాయి. 

ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పలరాజు, వేణుగోపాల కృష్ణ, గుమ్మనూరు జయరాం, శంకర్ నారాయణల‌ను కొత్త మంత్రివ‌ర్గంలో కొన‌సాగించ‌నున్నార‌ని స‌మాచారం. కొత్త మంత్రివ‌ర్గంలో మ‌హిళా ప్రాధాన్య‌త పెర‌గ‌నుంద‌ని తెలిసింది. . కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చే మహిళల్లో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిలు ఉన్నార‌ని స‌మాచారం.