గీతాంజలి మృతిపై రాజకీయరంగు: టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ మాటల యుద్ధం, ఎవరి వాదన వారిదే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలికి చెందిన గీతాంజలి మరణంపై టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ మధ్య మాటల యుద్ధం సాగుతుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలికి చెందిన గీతాంజలి మృతి రాజకీయ రంగు పులుముకొంది. గీతాంజలి ఆత్మహత్యకు టీడీపీ, జనసేన క్యాడర్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడమే కారణమని వైఎస్ఆర్‌సీపీ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలను టీడీపీ, జనసేన తోసిపుచ్చుతుంది. గీతాంజలి ఆత్మహత్యను వైఎస్ఆర్‌సీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందని టీడీపీ విమర్శిస్తుంది.
తెనాలికి చెందిన గీతాంజలికి రాష్ట్రప్రభుత్వం ఇంటి పట్టాను అందించింది. ఈ విషయమై ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి తమ కుటుంబానికి పొందిన ప్రయోజనంపై గీతాంజలి ఓ యూట్యూబ్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గీతాంజలి వ్యాఖ్యలను టీడీపీ, జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారని వైఎస్ఆర్‌సీపీ ఆరోపిస్తుంది.ఈ విమర్శలను తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని అధికార పార్టీ ఆరోపణలు చేస్తుంది.
ఈ నెల 7వ తేదీన తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఈ నెల 11వ తేదీన మరణించారు. గీతాంజలి మరణం రాజకీయ రంగు పులుముకుంది.
also read:వెరైటీ పెళ్లి పత్రిక: విత్తనాలను పంచుతున్న ఆదిలాబాద్ వాసి
ప్రభుత్వంతో తనకు జరిగిన లబ్దిని గురించి వివరించడమే గీతాంజలి తప్పైందని వైఎస్ఆర్‌సీపీ చెబుతుంది. ఈ కారణంగానే గీతాంజలిని సోషల్ మీడియా వేదికగా టీడీపీ, జనసేన శ్రేణులు ట్రోలింగ్ చేశారని ఆ పార్టీ ఆరోపిస్తుంది. గీతాంజలి మృతదేహం వద్ద ఆమె ఇద్దరు పిల్లలు రోధించడం కన్నీరు పెట్టించిందని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.గీతాంజలి ఆత్మహత్యపై వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు రాష్ట్రంలోని పలు చోట్ల నిరసనలకు దిగారు.
also read:లైవ్‌లోనే సహోద్యోగికి ప్రపోజ్: వైరలైన వీడియో
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాలను చేపట్టలేదని వైఎస్ఆర్‌సీపీ ఆరోపిస్తుంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని వైఎస్ఆర్‌సీపీ చెబుతుంది. గీతాంజలి కూడ తనకు ఇంటి పట్టా వచ్చిన ఆనందంలో ఇదే రకమైన వ్యాఖ్యలు చేసిందని వైఎస్ఆర్‌సీపీ గుర్తు చేస్తుంది. గతంలో మహిళల పట్ల తెలుగు దేశం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను కూడ వైఎస్ఆర్‌సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
also read:టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు: ఎవరి లెక్కలు వారివి....
ఇదిలా ఉంటే గీతాంజలి మృతి విషయమై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ చెబుతుంది. ఎస్. అజయ్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందనే ప్రచారాన్ని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తోసిపుచ్చారు.రైలు ప్రమాదం వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని ప్రకటించిన పోలీసులు ఆ తర్వాత ఆత్మహత్యగా ఎందుకు కేసును మార్చారని ఆమె ప్రశ్నించారు.శవ రాజకీయాలను మానుకోవాలని ఆమె వైఎస్ఆర్‌సీపీకి సూచించారు. గీతాంజలి మృతి వెనుక ఎవరున్నారో తేలాలని టీడీపీ వాదిస్తుంది. సోషల్ మీడియా వేదికగా టీడీపీ ఓ వీడియోను పోస్టు చేసింది.
also read:40 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు: సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇదిలా ఉంటే గీతాంజలి మృతిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టుగా గుంటూరు ఎస్పీ తుషార్ రూడీ చెప్పారు. ఈ కేసును రైల్వే పోలీసుల నుండి తెనాలి వన్ టౌన్ కు బదిలీ చేశారన్నారు. రైల్వే పోలీసుల విచారణ నివేదిక ఆధారంగా కేసును 174 సెక్షన్ నుండి ఆత్మహత్యలకు ప్రేరేపించినందుకు గాను సెక్షన్ 306కు మార్పు చేసినట్టుగా ఆయన చెప్పారు. గీతాంజలిని ట్రోల్ చేసిన సోషల్ మీడియా అకౌంట్స్ ను గుర్తించినట్టుగా ఎస్పీ వివరించారు. మరో వైపు గీతాంజలి కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం జగన్ ప్రకటించారు. గీతాంజలి కుటుంబానికి అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు.