Atchannaidu : వాలంటీర్ల వద్ద వివాహేతర సంబంధాల డేటా... ఎందుకో తెలుసా? : అచ్చెన్నాయుడు సంచలనం
టిడిపి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంపై వైసిపి నాయకుల తప్పుడు ప్రచారం చేస్తున్నారని... కానీ వాలంటీర్ల ద్వారా వారే తప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారని అచ్చెన్నాయడు ఆరోపించారు.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ ఏర్పాటుచేసిన వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వాలంటీర్ల వల్లే రాష్ట్రంలో మహిళలు మిస్సవుతున్నారంటూ జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఇలాగే వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేసారు. వివాహేతర, అక్రమ సంబంధాలు కలిగినవారిని వాలంటీర్లు గుర్తిస్తున్నారు... ఆ వివరాలను వైసిపి నాయకులకు అందిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసారు. ఈ వివరాలతో వారిని వైసిపి నాయకులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
టిడిపి పార్టీ చేపట్టిన భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి వస్తున్న ప్రజాధరణ చూసి వైసిపి నాయకులకు భయం పట్టుకుందని... అందువల్లే దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా టిడిపి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరిస్తున్నామని... స్వచ్చందంగా ముందుకు వచ్చేవారికే రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని అన్నారు. జగన్ రెడ్డి గ్యాంగ్ వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు మేము చేయడంలేదని అచ్చెన్నాయుడు అన్నారు.
వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు మొన్నటివరకు గడపగడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాల ద్వారా ప్రజలవద్దకు వెళ్లారని అచ్చెన్నాయుడు గుర్తుచేసారు. ఇలా వైసిపి నాయకులే ప్రజల ఇళ్లకు వెళ్లినా పట్టించుకోలేదు... అదే ప్రజలు తమ వద్దకు వచ్చిమరీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని అన్నారు. ఇది చూసి వైసిపి నాయకులకు నిద్రపట్టడం లేదు... అందువల్లే అసహనంతో పిచ్చిపటినట్లు వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
టిడిపి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంపై వైసిపి నాయకుల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మట్లేదని అచ్చెన్నాయుడు అన్నారు. వైసిపి లాంటి తప్పుడు పార్టీకి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే బుద్దిచెబుతారని... బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి పథకాన్ని అమలుచేస్తామని... ప్రతి హామీని నెరవేరుస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేసారు.