ఐఐటీ గువహతి హాస్టల్ రూమ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెంటల్ ప్రెజర్ కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు తెలిపారు. అకాడమిక్ పర్ఫార్మెన్స్ సరిగా లేనందున ఆయన కోర్సును యాజమాన్యం రద్దు చేసినట్టు ఐఐటీ వర్గాల వివరించాయి.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల విద్యార్థి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువహతికి చెందిన హాస్టల్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం వెల్లడించారు. గుడ్ల మహేష్ సాయి రాజ్‌గా మృతుడిని గుర్తించారు. ఆ విద్యార్థి బీటెక్ ఐదో సెమిస్టర్ చదివినట్టుగా తెలపారు. బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సు చదివాడు. మెంటల్ ప్రెజర్‌తో ఆదివారం ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అయితే, ఆయన మరణానికి గల వాస్తవ కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్టు అమిన్‌గావ్ పోలీసు స్టేషన్ అధికారులు వివరించారు. ఆ డెడ్ బాడీని పోస్టుమార్టం చేయడానికి పంపించారు. ఆ తర్వాత మహేష్ కుటుంబానికి అప్పగించారు.
ఈ ఘటనపై ఐఐటీ గువహతి ప్రకటన ఇలా ఉన్నది. తమ క్యాంపస్‌కు చెందిన ఓ హాస్టల్ బిల్డింగులో ఆ యువకుడి మృతదేహం కనిపించిందని తెలిపింది. ఆ యువకుడు తమ విద్యాసంస్థలో చదువుకున్న మాజీ విద్యార్థిగా గుర్తించినట్టు వివరించింది.
ఐఐటీ వర్గాల ప్రకారం, అకాడమిక్ పర్ఫార్మెన్స్ చాలా పూర్‌గా ఉండటం మూలంగా ఆయన కోర్సును టర్మినేట్ చేసినట్టు తెలిపాయి.
ఈ ఘటన వెలుగులోకి రాగానే.. మహేష్ కుటుంబానికి విషయం చేరవేసినట్టు ఆ స్టేట్‌మెంట్‌లో ఐఐటీ సంస్థ తెలిపింది. ఈ విషాద సమయంలో మహేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఆ ప్రకటనలో వెల్లడించింది.
పోలీసు దర్యాప్తునకు తాము సహకరిస్తామని వివరించింది. అంతేకాదు, ఈ ఘటనపై విచారణకు అంతర్గతంగా ఒక కమిషన్ వేస్తామని తెలిపింది.
