అమరావతి: వివక్ష, అవినీతికి తావు లేకుండా 17 నెలలుగా పాలన సాగుతోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ సీఎం  జగన్ క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆదివారం నాడు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు.అనంతరం ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో  సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

పిల్లల చదువులు, ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి గతంలో ఉండేదన్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని చెప్పారు.

ప్రభుత్వ హక్కుగా దక్కాల్సిన సేవలకు కూడా నోచుకొని పరిస్థితి ఉండేదన్నారు. ఇంటింటి ఆత్మగౌరవం నిలబట్టేలా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.సమస్యలు సవాళ్లు ఉన్నా కర్తవ్యం పవిత్రమైందని ఆయన చెప్పారు.మంచి పాలనా దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయాన్ని సీఎం వివరించారు.

వైద్యం, చదువు, ఆరోగ్యం, వ్యవసాయంతో పాటు పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్టుగా ఆయన తెలిపారు.కులం, మతం, ప్రాంతం, వర్గం పార్టీ అనే తేడా లేకుండా ప్రజలందరికీ సేవలు అందిస్తున్నట్టుగా సీఎం వివరించారు. ప్రతి గ్రామం రూపు రేఖలు మార్చేందుకు చర్యలు చేపట్టినట్టుగా  ఆయన తెలిపారు.