న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ని 371తో పోల్చవద్దని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లుపై లోకసభలో మంగళవారం వివరణ ఇస్తూ ఆయన ఆ విషయాలు చెప్పారు. 

ఆర్టికల్ 370 కారణంగానే కాశ్మీర్ ను భారత్ ను వేరు చేసి చూశారని, ఆర్టికల్ 370 రద్దుతో 70 ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించిందని అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీది సాహసోపేతమైన నిర్ణయమని ఆయన ప్రశంసించారు. మోడీ తీసుకున్న నిర్ణయం వల్లనే పరిష్కారం లభించిందని చెప్పారు. 

పరిస్థితులు చక్కబడగానే జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. 370 రద్దుపై ఎప్పుడు చర్చ జరిగినా ప్రజలంతా మోడీని గుర్తు చేసుకుంటారని ఆయన అన్నారు. పాకిస్తాన్ నుంచి ప్రేరణ పొందినవారితో చర్చలు జరపాలా అని ఆయన అడిగారు. 

పాకిస్తాన్ కుటిల నీతి వల్లనే కాశ్మీర్ యువత ఆయుధాలు పట్టుకుందని, తాము ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరించి ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు 370 ఆర్టికల్ రద్దు మంచిదా, చెడుదా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందని కూడా అమిత్ షా అన్నారు.