సామాజిక న్యాయ భేరి పేరుతో ఆంధ్రప్రదేశ్ మంత్రులు బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది.
సామాజిక న్యాయ భేరి పేరుతో ఆంధ్రప్రదేశ్ మంత్రులు బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సుయాత్ర ద్వారా ప్రజలకు వివరించనున్నారు. ఈ రోజు ఉదయం శ్రీకాకుళంలోని సెవెన్ రోడ్స్ జంక్షన్‌లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగహ్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రులు బస్సుయాత్ర ప్రారంభించారు.
తొలి రోజు బస్సు యాత్ర చిలకపాలెం, సుభద్రాపురం, రణస్థలం, పైడిభీమవరం మీదుగా పూసపాటిరేగ వద్ద విజయనగరం జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి కందివలస, జమ్ము నారాయణపురం మీదుగా విజయనగరం న్యూ పూర్ణ జంక్షన్‌కు చేరుకుంటుంది. అక్కడ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం బస్సు యాత్ర విశాఖ చేరుకుంటుంది. రాత్రికి మంత్రులు విశాఖలో బస చేయనున్నారు.
బస్సు యాత్ర నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అభివృద్దిలో మార్పును ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన సాగుతుందన్నారు. అవినీతి లేకుండా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందుతున్నాయని అన్నారు. వాస్తవాలు వివరించేందుకే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టినట్టుగా చెప్పారు. ప్రజల అభీష్టం మేరకే బస్సుయాత్ర చేపట్టామన్నారు. మూడేళ్ల అభివృద్దిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బస్సు యాత్ర సాగనుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. నాలుగు చోట్ల సామాజిక న్యాయభేరి బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు. వైఎస్ జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు జరిగిన సామాజిక న్యాయంపై వివరిస్తామని చెప్పారు. బలహీన వర్గాలు పాలితులుగా కాకుండా పాలకులుగా ఉండాలన్నదే లక్ష్యం అని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేశారని అన్నారు. కేబినెట్‌లో తొలిసారిగా 74 శాంత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం ఇచ్చారని.. సంక్షేమ పథకాలు నేరుగా డీబీటీ ద్వారా లబ్దిదారులకే అందుతున్నాయని అన్నారు. ఎక్కడా అవినీతి లేకుండా లబ్దిదారులకు సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని చెప్పారు. ఏ ప్రభుత్వంలోనైనా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలయ్యాయా అని ప్రశ్నించారు.
నాలుగు రోజుల పాటు యాత్ర..
వైసీపీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రం.. ఈ నెల 29న అనంతపురంలో ముగుస్తుంది. బస్సుయాత్రలో భాగంగా 26న విజయనగరం, 27న రాజమహేంద్రవరంలో, 28న నరసరావుపేటలో, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. యాత్రలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులు పొందిన వారు పాల్గొని సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించనున్నారు.
