అమరావతి: కోట్లు ఖర్చుపెట్టి కోర్టుల్లో కేసులు వేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వానికి పదే పదే చంద్రబాబునాయుడు అడ్డుపడుతున్నాడని ఏపీ మంత్రి కొడాలి నాని  ఆరోపించారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కోర్టుల్లో ఉన్న కేసుల స్టేను చంద్రబాబు వేకేట్ చేస్తే డిసెంబర్ 21న జగన్ పుట్టినరోజున టిడ్కో ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేస్తామన్నారు.30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా రూ.25 కోట్లను కోర్టు కేసుల కోసం ఖర్చు పెడుతున్నారని ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు. 

కోర్టుల్లోని కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.ఇళ్ల పట్టాల విషయంలో చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని మార్చుకోకపోతే టిడ్కో ఇళ్ల ముందు తానే ఆందోళన చేపడుతానని మంత్రి హెచ్చరించారు.

కులాలు, మతాల గురించి చంద్రబాబునాయుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మంత్రి చెప్పారు. ప్రభుత్వం గురించి అవాస్తవాలు మాట్లాడితే తగిన శాస్తి చేస్తామని ఆయన హెచ్చరించారు.

అధికారం కోసం మనుషుల మధ్య చంద్రబాబు మాదిరిగా జగన్ ఏనాడూ చిచ్చు పెట్టలేదన్నారు.  కులాలు, మతాలను కూడ తాము ఏనాడూ వాడుకోలేదని మంత్రి నాని స్పష్టం చేశారు.

నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య అంశాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఈ విషయమై సమగ్ర విచారణకు సీఎం ఆదేశించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. నిందితులకు టీడీపీకి చెందిన లాయర్ రామచంద్రరావు బెయిల్ ఇప్పించారని కొడాలి నాని మండిపడ్డారు.