Asianet News TeluguAsianet News Telugu

రాత్రి 8 దాటితే కుమ్మేయండి.. పోలీసులకు ఏపీ హోం మినిస్టర్‌ స్ట్రిక్ట్‌ ఆర్డర్స్‌

ఆంధ్రప్రదేశ్ కొత్త హోం మంత్రి వంగలపూడి అనిత పోలీసులను పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో అవమానపడ్డ చోటే గౌరవం పొందుతున్న ఆమె... అసాంఘిక శక్తులపై విరుచుకుపడాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాత్రి 8 దాటాక రోడ్ల వెంట అలాంటి వారు కనిపిస్తే పోలీసు స్టైల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెనకాడొద్దని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చేశారు. 

Andhra Pradesh Home minister Vangalapudi Anitha Strict orders GVR
Author
First Published Jun 19, 2024, 7:36 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో మాదక ద్రవ్యాల నిర్మూలనపై కొత్త హోం మంత్రి వంగలపూడి అనిత దృష్టి పెట్టారు. ఈ అంశంపైనే హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందే అనిత సమీక్ష నిర్వహించారు. గంజాయి నిర్మూలనపై పోలీసు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. రాష్ట్రానికి ఎక్కడి నుంచి గంజాయి వస్తుంది..? ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి ఆంధ్రప్రదేశ్‌లోకి రాకుండా అరికట్టడానికి ఎన్ని చెక్‌ పోస్టులు ఉన్నాయి..? గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను వాసన ద్వారా పసిగట్టడానికి ఎన్ని డాగ్‌ స్క్వాడ్‌లు ఉన్నాయి..? తదితర అంశాలపై అధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా వాస్తవాలు తెలుసుకొని హోం మంత్రి అనిత విస్తుపోయారు. ఆంధ్రప్రదేశ్‌ దారుణమైన పరిస్థితిలో ఉందని ఈ సందర్భంగా వాపోయారు. 

గత ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం ఒక్కసారి కూడా గంజాయి నిర్మూలనపై సమీక్ష చేయకపోవడం దారుణమని హోం మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆఖరికి వైసీపీ నాయకులు కూడా గంజాయి అమ్ముకోవడం,గంజాయి వ్యాపారంపైనే ఆధారపడ్డారు కాబట్టే గడిచిన ఐదేళ్లలో కనీసం రివ్యూ చేయలేదని ఆరోపించారు. గంజాయి అక్రమ రవాణా ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి జరుగుతోందని.. చింతపల్లి, జీ.మాడుగుల, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి గంజాయి సరఫరా అవుతోందని తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు ఎన్ని చెక్‌ పోస్టులున్నాయని పోలీసులను అడిగితే మూడంటే మూడే ఉన్నాయని సమాధానం రావడంపై అసహనం వ్యక్తం చేశారు. 

ఆఖరికి అమెజాన్‌లో కూడా గంజాయి అమ్మేస్తున్నారని... కరివేపాకు పేరు చెప్పి ఆన్‌లైన్‌లో గంజాయిని విక్రయిస్తున్నారని పోలీసు శాఖ సమీక్షలో ఎలాంటి సంకోచం లేకుండా హోం మంత్రి వంగలపూడి అనిత అనడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మాదక ద్రవ్యాలకు కేంద్రంగా మారిన విశాఖలో దారుణమైన పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసిన హోం మంత్రి అనిత... టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. రాత్రి 8.30, 9 దాటాక ఎక్కడైనా రోడ్లపైగానీ, చీకట్లోగానీ గుంపులుగా ఉన్నవారిపై, గంజాయి తీసుకుంటున్న అనుమానంగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లు అనుమానమొస్తే ఎలాంటి చర్యలకైనా వెనకాడొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితి ఉందని.. గంజాయిని వాసన పట్టడం ద్వారా గుర్తించడానికి రెండంటే రెండే డాగ్‌ స్వాడ్‌లు ఉన్నాయని తెలుసుకొని విస్తుపోయారట హోం మంత్రి వంగలపూడి అనిత. 

బుధవారం హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని... తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకు వెళతామని చెప్పారు. ‘‘హోం మినిస్టర్‌గా ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నా.. ఇంకా నేర్చుకుంటా... చట్ట ప్రకారమే ముందుకెళ్తా.. తప్పు చేసినవారికి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడుతుంది. పాత కేసుల్లో బెయిల్‌పై బయటకు వచ్చామంటే కుదరదు. బెయిల్‌పై బయటకు వెళ్లిపోయిన వారిని కూడా వదలం. ముందులాగే ఉంటామంటే కచ్చితంగా చర్యలు ఉంటాయి. టీడీపీ ఆఫీసు, కార్యకర్తలపై దాడులు చేసినవారిని ఉపేక్షించబోం. గత ఐదేళ్లలో వైసీపీ అక్రమాలు, ఆగడాలకు బలైపోయిన తెలుగుదేశం శ్రేణులతో సామాన్య ప్రజలు ఫిర్యాదు చేస్తే... నిందితులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌లో గంజాయి సరఫరాను అరికడతాం. ఎట్టి పరిస్థితి కాంప్రమైజ్‌ అవ్వం. గత ప్రభుత్వంలో ఉన్నట్లే ఉంటామనే పోలీసులు పక్కకు తప్పుకోవాలి..'' అని హోం మంత్రి వంగలపూడి అని పేర్కొన్నారు.

అలాగే, ‘‘దిశ చట్టం లేకుండా దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఆ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తాం. పోలీస్ శాఖ పరంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా పోలీస్ స్టేషన్లలో కనీస సౌకర్యాలు లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యలన్నింటినీ రాబోయే రోజుల్లో పరిష్కరిస్తాం. మా పార్టీ నాయకులు, ప్రతినిధుల కోసం కాకుండా ప్రజల కోసం, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ అధికారులు రాజీ లేకుండా పనిచేయాలి. సోషల్ మీడియా వేదికగా  విచ్చలవిడిగా విమర్శించేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు పెట్టడాన్ని ఏమాత్రం సహించబోం’’ అని హోం మంత్రి అనిత హెచ్చించారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios