విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్ విషయమై దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు మంగళవారం నాడు విచారణను ప్రారంభించింది.హైకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ జడ్జిలతో పాటు ప్రముఖుల ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని హైకోర్టులో సోమవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ విషయమై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణను చేపట్టింది.ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఓ పోలీస్ అధికారిని కూడ నియమించారని కూడ పిటిషనర్ పేర్కొన్నారు.  ఫోన్ ట్యాపింగ్ పై కచ్చితమైన ఆధారాలు ఉంటే సమర్పించాలని హైకోర్టు పిటిషనర్ ను ఆదేశించింది.

ప్రతి జడ్జి కదలికల్ని పోలీసులతో పర్యవేక్షిస్తున్నారని కూడ కోర్టుకు తెలిపాడు పిటిషనర్.  అయితే అదనపు సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేస్తానని పిటిషనర్ పేర్కొన్నారు. 

ఫోన్ ట్యాపింగ్ విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయమై తాము విచారణకు ఎందుకు ఆదేశించకూడదని అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 20వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.