గుంటూరు: గుంటూరు అర్బన్ పోలీసులపై  ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు అర్బన్ పోలీసుల తీరుపై హైకోర్టు  మండిపడింది. బాధితులు హైకోర్టు ముందు పోలీసులు వ్యవహరించిన తీరును వివరించారు. దీంతో హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

క్రికెట్ బెట్టింగ్ ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను గుంటూరు అర్బన్ పోలీసులు నిర్భంధించినట్టుగా బాధితులు హైకోర్టు ముందు చెప్పారు. అయితే బాధితుల తరపున  వారి కుటుంబసభ్యులు హైకోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు.

తమ వాళ్లు కన్పించడం లేదంటూ ఈ మూడు కుటుంబాలకు చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడ ప్రయోజనం దక్కలేదు. ప్రైవేట్ కేసు దాఖలు చేయడంతో  హైకోర్టులో ఈ ముగ్గురు బాధితులను పోలీసులు హాజరుపర్చారు.

హైకోర్టు న్యాయమూర్తి ఎదుట బాధితులు నోరు విప్పారు. 15 రోజులుగా పోలీసులు తమను నిర్భంధించిన విషయాన్ని  బాధితులు కోర్టు ముందు ఉంచారు. తమను పోలీసులు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో వివరించారు.

పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ, సీసీఎస్ సీఐ వెంకట్రావులపై న్యాయ విచారణకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ 28వ తేదీ లోపుగా  నివేదిక ఇవ్వాలని  హైకోర్టు ఆదేశించింది.