అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తివేసింది ఏపీ హైకోర్టు. వెంకటేశ్వరరావు రిట్ పిటిషన్ విచారణను పరిగణనలోకి తీసుకొంది హైకోర్టు. క్యాట్ ఆర్డర్ ను కూడ ఏపీ హైకోర్టు పక్కన పెట్టింది.

ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకోవాలని కూడ శుక్రవారం నాడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.కక్ష సాధింపుతోనే తనను సస్పెండ్ చేశారని ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు.

ఏబీ వెంకటేశ్వరరావు కేసు: సీఎస్, డీజీపీ, కేంద్ర హోం సెక్రటరీలకు ఏపీ హైకోర్టు నోటీసులు

 సస్పెండ్ చేసిన జీవోతో పాటు క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను కూడ రద్దు చేయాలని హైకోర్టులో ఆయన  ఆశ్రయించారు. ఈ విషయమై ఈ ఏడాది ఏప్రిల్ 23న కేంద్ర హోం సెక్రటరీకి, ఏపీ డీజీపీకి, ఏపీ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే తన పిటిషనర్‌ను బదిలీ చేసి జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించిన విషయాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత కొంత కాలానికి సస్పెండ్ చేశారని చెప్పారు.గత ఏడాది మే 30 వ తేదీన సస్పెండ్ చేశారని, అప్పటి నుండి ఇంతవరకు జీతభత్యాలు ఇవ్వని విషయాన్ని ఆయన కోర్టుకు తెలిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన జీఏడీ జారీ చేసిన 18 నెంబర్ జీవోను,  మార్చి 17న క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన  సస్పెన్షన్ ను  పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన నిర్ణయం తీసుకొంది. సివిల్ సర్వీసెస్ రివ్యూ కమిటీ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆ సమయంలో ప్రభుత్వం ప్రకటించింది.

సస్పెన్షన్ కు సంబంధించి ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో సవాల్ చేశారు. అయితే క్యాట్  ఐపీఎస్ అధికారి పిటిషన్ ను ఈ ఏడాది  మార్చి 17న తోసిపుచ్చింది.1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు.

పోలీస్ ఇంటలిజెన్స్ ప్రోటోకాల్స్ విధానాలను ఉద్దేశ్యపూర్వకంగా ఆయన ఉల్లంఘించారని ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును మార్చి 7వ తేదీన సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.