ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏలూరు ఘటనపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. వింత వ్యాధిపై కారణాలను తెలుసుకునేందుకు  21 మంది సభ్యులతో కూడిన కమిటీని వేసింది. ఈ  కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ, కన్వీనర్ గా ఆరోగ్య శాఖ ప్రినిపల్స్ సెక్రెటరీలు ఉంటారు. ఈ కమిటీ వ్యాధిపై వివరాలతో పాటు నివారణ చర్యలు కూడా సూచించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

మరోవైపు ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడ్డ 609 మందిలో 543 మంది పలు ఆసుపత్రుల్లో కోలుకొని డిశ్చార్జి అయ్యారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారిలో 33 మందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించారు. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. 

కాగా ఏలూరు అంతుచిక్కని వ్యాధిపై  ఎయిమ్స్ మరింత లోతుగా పరిశోధన చేస్తోంది. దీనికోసం మరిన్ని రక్త నమూనాలను ఢిల్లీ ఎయిమ్స్ విశ్లేషించింది. ఇప్పటివరకు మొత్తం 37 రక్త నమూనాల విశ్లేషణ చేసింది.  వీటిల్లో 21 నమూనాల్లో అధిక మోతాదులో సీసం (లెడ్),
మిగతా నమూనాల్లోనూ సీసం, నికెల్ వంటి భారలోహాలు గుర్తించింది.  భార లోహాలతో పాటు ఆర్గానోక్లోరిన్స్ కూడా ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు.

ఈ ఆర్గానోక్లోరిన్స్ పరీక్షల కోసం ఎయిమ్స్ ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సహాయం కోరింది. అయితే దీనికి  హోంశాఖ నుంచి రాతపూర్వకంగా ఆదేశాలు కావాల్సి ఉంటుందని సీఎఫ్ఎస్ఎల్ తెలిపింది. 

దీనికోసం ఎంపీ జీవీఎల్ నరసింహారావు చొరవ తీసుకుని ప్రభుత్వం నుంచి రాతపూర్వక ఉత్తర్వులు వచ్చేలా చేశారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఆర్గానో క్లోరిన్స్ ఆనవాళ్ల కోసం సీఎఫ్ఎస్ఎల్ పరిశోధనలు మొదలుపెట్టింది. ఈ ఫలితాలు రేపు మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉంది. 

కాగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్, ఢిల్లీ ఎయిమ్స్ సంస్థ లనుంచీ నేడు  వింత వ్యాధి నిర్దారణా ఫలితాలు రానున్నాయి. మూడురోజుల క్రితం ఎయిమ్స్, nin సంస్థలు ఏలూరు వచ్చి శాంపిల్స్ సేకరించాయి. ఈ సంస్థలు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా వింత వ్యాది నిర్ధారణ కు వచ్చే అవకాశం.