కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో, దాడులు దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఏపీ ఆదేశాలు జారీ చేసింది. 

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో, దాడులు దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఏపీ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే ‘‘సమ్మతి’’ ఉత్తర్వును ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

అంతర్గత కుమ్ములాటలతో కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రతిష్ట మసకబారిందని... రాష్ట్రంలో ఆ సంస్థ ప్రమేయం అవసరం లేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉత్వర్వుల్లో పేర్కొంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం 1946 ప్రకారం కేంద్ర ప్రభుత్వం సీబీఐని ఏర్పాటు చేసింది.

దీంతో ఢిల్లీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మతి తెలపాల్సి ఉంటుంది. సాధారణ సమ్మతిని వెనక్కి తీసుకునే అధికారం కూడా చట్టంలో పొందుపరిచారు. ఏపీ తొలి నాటి నుంచి సమ్మతి ఇస్తూ వస్తోంది.. అయితే ఇటీవలి కాలంలో అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు, అవినీతి ఆరోపణలతో సీబీఐ ప్రతిష్ట మసకబారుతోంది.

కేంద్ర దర్యాప్తు సంస్థతో పోలిస్తే రాష్ట్ర దర్యాప్తు సంస్థలే మెరుగ్గా వ్యవహరిస్తున్నాయని అందువల్ల... సీబీఐ ప్రవేశానికి అంగీకరించే సాధారణ సమ్మతిని ఉపసంహరించాలని ఓ న్యాయవాది ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... కేంద్ర ప్రభుత్వ సంస్థల దాడులపై అధ్యయనం చేసింది.. మంత్రివర్గ సమావేశంలోనూ చర్చించింది.

రాజకీయపరమైన విభేదాలతోనే రాష్ట్రంలో వరుస దాడులు జరుగుతున్నాయని కేబినెట్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సీబీఐకి ఇచ్చే సాధారణ సమ్మతిని వెనక్కి తీసుకుంటున్నట్లుగా నవంబర్ 8న ఏపీ నోటీఫికేషన్ వెలువరించింది.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ ఉత్తర్వులు ఇప్పుడు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. 

Scroll to load tweet…