Asianet News TeluguAsianet News Telugu

కాంట్రాక్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం భరోసా.. ఉద్యోగ భద్రతపై త్వరలోనే ప్రకటిస్తామన్న మంత్రి

కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసానిచ్చింది. త్వరలోనే ఉద్యోగ భద్రతపై ప్రకటన చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ హామీనిచ్చారు. ఆందోళనకు ముగింపు పలకాలని, సీఎం జగన్‌మోహన్ రెడ్డితో మాట్లాడి త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

andhra pradesh gave assurance to contract lecturers
Author
Amaravati, First Published Sep 27, 2021, 7:11 PM IST

అమరావతి: జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని కాంట్రాక్ట్ లెక్చరర్లకు భరోసానిచ్చింది. ఉద్యోగ భద్రతపై ఆందోళన వద్దని తెలిపింది. త్వరలోనే వారి ఉద్యోగ భద్రతపై సమగ్ర ప్రకటన చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ హామీనిచ్చారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల యూనియన్ ప్రతినిధులు సచివాలయంలోని చాంబర్‌లో మంత్రి సురేశ్‌తో సమావేశమయ్యారు. డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్‌ల సమస్యలపై యూనియన్ ప్రతినిధులు మంత్రికి వినతులు ఇచ్చారు. వారి వినతి పత్రాలపై మంత్రి వెంటనే స్పందించి సమావేశం ఏర్పాటు చేశారు. తమ వినతి పత్రాలపై స్పందించి సకాలంలో చర్చలు జరిపిన మొట్టమొదటి విద్యా శాఖ మంత్రి తమరేనని యూనియన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సురేశ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. ఒక్కసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట ఇస్తే దాన్ని నిలుపుకోవడానికి ఎంతదూరమైనా వెళ్తారని వివరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై 2019 జులైలో జీవోఎం, 2019 నవంబర్‌లో వర్కింగ్ వేశామని తెలిపారు. 

అయితే, ఈ లోగా కొవిడ్ రావడంతో చర్చలు పూర్తిస్థాయిలో జరగలేదని మంత్రి చెప్పారు. అయితే, ఉద్యోగ భద్రతకు తాము పూర్తి భరోసానిస్తామని అన్నారు. మార్చి 2022 వరకు ఒప్పందం ఉన్నదని వివరించారు. అప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఈ లోగా సీఎం జగన్‌తో మాట్లాడి తదుపరి విధివిధానాలను ప్రకటిస్తామని చెప్పారు. విద్యావ్యవస్థలో ప్రైవేటు యాజమాన్యాల గుత్తాధిపత్యాన్ని లేకుండా చేయడానికి కొన్ని సంస్కరణలు చేస్తున్నట్టు వివరించారు. ఆందోళనకు ముగింపు చెప్పాలని, సీఎంతో వారి సమస్యలపై చర్చించి తుదపరి నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios