Andhra pradesh: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని జీఎంఈ కాలనీలో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అరెస్ట్ సమయంలో పోలీసులకు ప్రతిఘటన
సీదిరి అప్పలరాజు అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. అరెస్ట్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు, కార్యకర్తల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అప్పలరాజును తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం ఆయనను కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు.
కుమారుడి ప్రమాదం కేసుతో వెలుగులోకి వచ్చిన ఆరోపణలు
కొద్ది రోజుల క్రితం అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో కుమారుడిని చట్టపరమైన చర్యల నుంచి తప్పించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు అప్పలరాజుపై వచ్చాయి. ప్రమాదానికి సంబంధించి అసలు వాస్తవాలను మార్చే ప్రయత్నం చేశారని, మరో వ్యక్తిని నిందితుడిగా చూపించే కుట్ర జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ప్రమాదానికి సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేయడం, బాధిత కుటుంబాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారన్న అభియోగాలు కూడా నమోదయ్యాయి.
ముందస్తు బెయిల్ ప్రయత్నాలు.. విచారణ కొనసాగింపు
ఈ కేసులో ఇప్పటికే ఆరవ్ వర్మ రిమాండ్‌లో ఉండగా, తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం సీదిరి అప్పలరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, తాజా అరెస్ట్ అనంతరం పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని, సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.


