భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అంబేడ్కర్ కొనసీమ జిల్లాలో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతుంది. యానాంలో గోదావరి పొంగిపోర్లుతుంది. భారీ వరద నేపథ్యంలో అయ్యన్న నగర్‌లో ఏటిగట్టుకు గండి పడింది.
భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అంబేడ్కర్ కొనసీమ జిల్లాలో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతుంది. యానాంలో గోదావరి పొంగిపోర్లుతుంది. భారీ వరద నేపథ్యంలో అయ్యన్న నగర్‌లో ఏటిగట్టుకు గండి పడింది. దీంతో కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరుతుంది. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఇళ్లలోకి వదర నీరు వచ్చి చేరుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అంబేడ్కర్ కొనసీమ జిల్లాలో 36 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలోకి వెళ్లాయి. రానున్న 24 గంటల వరద ఉధృతి ఎక్కువగా ఉండే చాన్స్ ఉండటంతో.. లంక గ్రామాలకు ఈ సమయం కీలకం కానుంది.
మరోవైపు ముమ్మిడివరం మండలం అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద కుడి కాలువలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతుంది. ఏ క్షణమైనా అన్నంపల్లి అక్విడెక్ట్ దగ్గర గండిపడే అవకాశం ఉందని చెబుతున్నారు. గండి పడితే ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాలల్లోని 25 గ్రామాల్లో అపార నష్టం సంభవించే అవకాశం ఉంది. దీనిని నివారించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నంపల్లి వైపు ఎవరినీ రానీయకుండా అడ్డుకుంటున్నారు.
ఇక, గోదావరికి వరద ఉధృతి నేపథ్యంలో ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 20 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 23 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎగువ నుంచి 25 లక్షల క్యూసెక్కుల వదర నీరు బ్యారేజ్‌లోకి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 6 జిల్లాల్లోని 42 మండలాలల్లోని 628 గ్రామాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే 279 లంక గ్రామాలు నీట మునిగాయి. మరో 177 గ్రామాల్లోకి వరద నీరు చేరింది.
వరద సహాయక చర్యల్లో 10 ఎన్‌డీఆర్ఎఫ్, 10 ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. వారు ఇప్పటికే 220 పునరావస కేంద్రాలకు 60 వేలకు పైగా బాధితులను తరలించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
