గజదొంగే దొంగా.. దొంగా... అని అరిచినట్లు... జగన్ సర్కార్ పై అవినీతి ఆరోపణలు..: టిడిపికి బుగ్గన కౌంటర్
రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకే మెఘా సంస్థకు బ్యాంకుల రుణాలు పొందేందుకు అనుమతి ఇచ్చామని... టిడిపి నాయకులు ఆరోపిస్తున్నట్లు ఇది గ్యారంటీ కాదు పర్మిషన్ మాత్రమేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
అమరావతి : పూర్తిగా అవినీతి, అక్రమాల కేసుల్లో మునిగిన చంద్రబాబు నాయుడిని అధ్యక్షుడిగా పెట్టుకుని టిడిపి నాయకులు దోపిడీ అంటు మాట్లాడడం విడ్డూరంగా వుందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇది గజదొంగే... దొంగా దొంగా అంటూ అరిచినట్లుగా వుందని ఎద్దేవా చేసారు. వైసిపి ప్రభుత్వం ప్రజాధనాన్ని ప్రైవేట్ సంస్థలకు దోచిపెడుతోందంటూ టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణలన్ని అబద్దాలేనని అన్నారు. అవినీతి మచ్చలేని జగన్ సర్కార్ పై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయంగా మైలేజ్ పొందాలని టిడిపి నాయకులు భావిస్తున్నారని ఆర్థిక మంత్రి ఆరోపించారు.
ప్రైవేట్ రంగానికి చెందిన మెఘా సంస్థ వైసిపి ప్రభుత్వ గ్యారంటీతో రూ.2000 కోట్లు అప్పు తెచ్చుకుందంటూ టిడిపి అర్థంపర్ధం లేని ఆరోపణలు చేస్తోందని బుగ్గన మండిపడ్డారు. కమీషన్ల కోసమే వైసిపి పెద్దలు ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వంతో గ్యారంటీ ఇప్పించారని... రేపు ఏదైనా జరిగితే ఏంటని టిడిపి నాయకులు అంటున్నారని గుర్తుచేసారు. అసల ప్రభుత్వ గ్యారంటీ లెటర్ గురించి టిడిపి నాయకులకు కనీస అవగాహన లేదని అర్థమవుతోందని... ఆర్థిక అంశాలపై అవగాహన వున్న యనమల రామకృష్ణుడు లాంటివారు మాట్లాడటం ఎందుకు మాట్లాడటం లేదని బుగ్గన ప్రశ్నించారు.
ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ గ్యారంటీ అనేది ముమ్మాటికీ అబద్ధమని బుగ్గన స్పష్టం చేసారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మెఘా సంస్థదేనని... దీంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేవలం సదరు ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఎన్ని ఉన్నాయో అనే వివరాలు మాత్రమే బ్యాంకులకు ఇచ్చామన్నారు. కుదిరితే వాటిని ఏ సమయంలో చెల్లించడం జరుగుతుందో సూచించడం జరిగిందన్నారు. బ్యాంకు నుండి తీసుకున్న అప్పు, కట్టవలసిన వడ్డీ ఆ ప్రైవేట్ సంస్థకు, బ్యాంకుకు సంబంధించిన వ్యవహారం మాత్రమేనని అన్నారు. తిరిగి చెల్లించడంలో ఎలాంటి ఆలస్యం జరిగినా ప్రభుత్వానికి సంబంధం లేదని ఆర్థిక మంత్రి వివరించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తొందరగా పూర్తిచేయాలన్న ఉద్దేశ్యంతోనే మెఘా సంస్థ రుణం పొందేందుకు అనుమతి ఇచ్చామన్నారు. ఇది కేవలం పర్మిషన్ మాత్రమే గవర్నమెంట్ గ్యారంటీ కాదన్నారు. దీన్ని పట్టుకుని ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. చంద్రబాబు నాయుడు కళ్లలో పడేందుకే కొందరు టిడిపి నాయకులు ఈ దుష్ప్రచారం చేస్తున్నారని... దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆర్థిక పరమైన విషయాల గురించి మాట్లాడేముందూ పూర్తిగా సమాచారం సేకరించాలని... దానిపై స్పష్టత వచ్చిన తర్వాతే మాట్లాడితే బావుంటుందని బుగ్గన హెచ్చరించారు.
స్కిల్ డెవలప్ మెంట్ పేరిట ఏదో చేసేస్తున్నామని బిల్డప్ ఇచ్చి రూ.241 కోట్లు దోచుకున్నదెవరు? అని బుగ్గన ప్రశ్నించారు. రాజధాని అమరావతి నిర్మాణం పేరిట వేలకోట్లు సంపాదించింది ఎవరు? ఇన్నర్ రింగ్ రోడ్డుని మెలికలు తిప్పి అక్రమాలకు పాల్పడిందెవరు? అని టిడిపి నాయకులను నిలదీసారు. ఇలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా కలిసిన మీరు సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ సర్కార్ పై బుదరజల్లాననే తప్పుడు ప్రచారాలను ఆశ్రయించారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.