ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన నిర్వహణకు ఐఏఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఈ సమస్య మరింత తీవ్రంగా మారినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు యువ అధికారులు జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన పరిస్థితి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన నిర్వహణకు ఐఏఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఈ సమస్య మరింత తీవ్రంగా మారినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రానికి మొత్తం 239 అధికారులను కేటాయించగా.. వివిధ కేడర్‌లలో 179 అధికారులు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో మరింత మంది అధికారులను కేటాయించాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అయితే రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారుల కొరతను ఎదుర్కొంటుంది. ఈ అంశాన్ని ఏపీ సర్కార్ పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక కేసుగా పరిగణించాలని కోరింది.
ఇదిలా ఉంటే.. సీఎం వైఎస్ జగన్ సాధారణ జాయింట్ కలెక్టర్ పోస్టులకు అదనంగా రెండు జాయింట్ కలెక్టర్ పోస్టులను సృష్టించారు. కొత్తగా ఏర్పాటైన వార్డు/గ్రామ సచివాలయాలు, ఆరోగ్యానికి సంబంధించిన పరిపాలన బాధ్యతలను ఒక జాయింట్ కలెక్టర్‌కి అప్పగించగా.. జగనన్న హౌసింగ్ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు మరో యువ అధికారిని నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో దాదాపు 31 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని హౌసింగ్ ప్రాజెక్టుకు ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఇక, సంక్షేమ పథకాలు, హాస్టళ్ల నిర్వహణను చూసేందుకు ఒక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ అధికారిని జాయింట్ కలెక్టర్-3గా నియమించింది.
జిల్లా కలెక్టర్లుగా మారుతున్న యువ అధికారులు..
వార్డు, గ్రామ సచివాలయాలు, ఆరోగ్యం, గృహనిర్మాణం, ఇతర రంగాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వ వైఖరిలో.. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మార్పు వచ్చినట్టుగా కనిపిస్తుంది. కొత్తగా సృష్టించిన జాయింట్ కలెక్టర్ పోస్టుల నుంచి ఐఏఎస్ అధికారుల సేవలను ఉపసంహరించుకుని కొత్త జిల్లాలకు పోస్టింగ్ ఇచ్చింది. ఇక, క్షేత్రస్థాయి పరిపాలనను నిర్వహించడానికి యువ అధికారుల కొరత తీవ్రంగా ఉన్న మాట వాస్తవమేనని సీనియర్ అధికారి చెప్పినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. అధికారుల కొరత కారణంగా అనేక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లను ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు నిర్వహిస్తున్నారని ఆ అధికారి చెప్పినట్టుగా తెలిపింది.
‘‘గతంలో ఐటీడీఏలలో పనిచేయడం అనేది ఐఏఎస్ అధికారులకు ప్రొబేషన్ పూర్తయిన తర్వాత మొదటి అసైన్‌మెంట్‌గా ఉండేది. ఎందుకంటే భౌగోళికంగా కఠినమైన ప్రాంతాలలో క్లిష్టమైన సమస్యలను నిర్వహించడం వారికి మంచి ఎక్స్‌పోజర్‌ను ఇస్తుందని భావిస్తారు. ఇప్పుడు చాలా మంది యువ అధికారులు జాయింట్ కలెక్టర్లుగా పోస్టింగ్ పొందుతున్నారు. ఆసక్తికరంగా.. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత సబ్ కలెక్టర్‌గానో లేదా పెద్ద మునిసిపల్ కార్పొరేషన్‌లలో మునిసిపల్ కమీషనర్‌గా పనిచేసిన వెంటనే జాయింట్ కలెక్టర్లుగా కూడా పని చేయకుండానే కొంతమంది యువ అధికారులు జిల్లా కలెక్టర్లుగా కూడా మారారు’’ అని ఆ అధికారి తెలిపారు. అధికారుల కొరతతోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని మరొక అధికారి చెప్పారు.
