Asianet News TeluguAsianet News Telugu

దూళిపాళ్ల ట్రస్టుకు మరోసారి నోటీసులు జారీచేసిన దేవదాయ శాఖ.. నోటీసుల్లో ఏముందంటే..?

గుంటూరు జిల్లాలోని దూళిపాళ్ల ట్రస్టుకు దేవదాయ శాఖ మరోసారి నోటీసులు జారీచేసింది. దూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌కు (DVCMT) దేవాదాయ శాఖ చట్టంలోని సెక్షన్ 43 కింద ట్రస్టుకు తాజాగా అధికారులు నోటీసులు జారీ చేశారు.

Andhra Pradesh Endowments department once again issued notice to Dhulipalla Veeraiah Chowdary Memorial Trust
Author
First Published Jun 25, 2022, 10:30 AM IST

గుంటూరు జిల్లాలోని దూళిపాళ్ల ట్రస్టుకు దేవదాయ శాఖ మరోసారి నోటీసులు జారీచేసింది. దూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌కు (DVCMT) దేవాదాయ శాఖ చట్టంలోని సెక్షన్ 43 కింద ట్రస్టుకు తాజాగా అధికారులు నోటీసులు జారీ చేశారు. ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఎండోమెంట్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం ట్రస్ట్‌ను నమోదు చేయాలని ఎండోమెంట్స్ కమిషనర్ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్  కోర్టును ఆశ్రయించింది. ఈ ట్రస్ట్ దేవాదాయ చట్టం పరిధిలోకి రాదని కోర్టులో అప్పీల్ చేసింది. తమ ట్రస్టు ఆధ్వర్యంలోని ఆసుపత్రి సంగం డైరీ పాల ఉత్పత్తి దారుల కుటుంబాలకు సేవ చేస్తోందని ట్రస్ట్ యాజమాన్యం పేర్కొంది.

కోర్టులో ఈ అప్పీలు విచారణ సందర్భంగా డీవీసీఎంటీ పబ్లిక్ ట్రస్ట్ కాదని.. పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాల కోసం దీనిని నడుపుతున్నట్లు ఆ ట్రస్టు తరఫు న్యాయవాది చెప్పారు. ఎండోమెంట్స్ చట్టం కింద ట్రస్ట్ రిజిస్టర్ చేయబడితే.. అది స్వయంప్రతిపత్తి హోదాను కోల్పోతుందని అన్నారు. ఈ క్రమంలోనే  ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక, ట్రస్టు నిర్వహణ అంశంలో ఈ నెల 29 కోర్టులో విచారణ జరగనుంది. 

అయితే తాజాగా అధికారులు సెక్షన్ 43 ప్రకారం డీవీసీఎంటీ ట్రస్టుకు నోటీసులు పంపారు. సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకు ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపారు. అయితే  కోర్టు తీర్పుకు లోబడి ప్రక్రియ ఉంటుందని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఇక, డీవీపీ ట్రస్టు ద్వారా డీవీసీ ఆస్పత్రి నడుస్తోంది. పాల రైతులు, వారి కుటుంబ సభ్యులకు 50 శాతం డబ్బులకి వైద్యం అందిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios