ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. ఎన్నికలకు రెండేళ్లు ఉందని నిద్రపోవద్దని.. అందరూ సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో తెలుగు రైతు విభాగం వర్క్ షాప్‌లో పాల్గొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎన్నికలకు రెండేళ్లు ఉందని నిద్రపోవద్దని.. ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చని.. అందరూ సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతులను సీఎం జగన్ ప్రభుత్వం అడుగడుగునా ముంచిందన్నారు. ఉద్యోగుల నుంచి పేదల దాకా ప్రతి ఒక్క రంగాన్ని ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. 

మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా టీడీపీకి అంటగట్టాలని చూశారని మండిపడ్డారు. వివేకా హత్యతో వచ్చిన సానుభూతితో వైఎష్ జగన్ సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలోకి వచ్చాక హత్య కేసు నిందితులను ఎందుకు శిక్షించలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. 

రాష్ట్రంలో ఎన్నికలు ఏ క్షణంలో వచ్చినా టీడీపీ 160 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ కలలో లేచి రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తున్నట్లు లెటర్ ఇచ్చిన ఆశ్చర్య పోనవసరం లేదన్నారు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకొని టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల వల్లే టీడీపీ 2019లో ఓడిపోయిందన్నారు. తాము ఉద్యోగులను గౌరవించామని.. టీడీపీ హయాంలో వారికి 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. భయపడో, ప్రలోభాలకు గురయ్యో ఉద్యోగులు ప్రభుత్వానికి లొంగిపోయారని అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం.. రైతులకు ఉరితాళ్లుగా మారుతున్నాయని విమర్శించారు.