ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే కూటమి లక్ష్యం.. ఎన్డీయే సమావేశంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
Vallabhaneni Balashowry : ఎన్డీయే హయాంలో దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తుందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. వైసీపీ నుంచి జనసేనలో చేరిన మూడు నెలల్లోనే తిరిగి ఎంపీగా విజయం సాధించారాయన. జనసేనాని పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంతో పాటు మచిలీపట్నం ప్రాంత అభివృద్ధికి పాటుపడతామంటున్నారు...
Vallabhaneni Balashowry : దేశ ప్రగతితో పాటు ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి ఎన్‌డీయే ప్రభుత్వం కృషి చేస్తుందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. ఢిల్లీ వేదికగా శుక్రవారం జరిగిన ఎన్డీయే పార్టీమెంటరీ పార్టీ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత పవన్ కల్యాణ్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఎన్డీయే సమావేశంలో పాల్గొన్నారు. ఎన్డీయే పార్లమెంటరీ సమావేశానంతరం ఎంపీ బాలశౌరి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపేందుకు కూటమి ఎంపీగా అహర్నిశలు కష్టపడతానన్నారు. కేంద్ర సహకారంతో పోలవరం, మచిలీపట్నం పోర్టు లాంటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తామని తెలిపారు.
తోటి ఎంపీలతో ఆత్మీయ కలయిక...
ఈ ఎన్నికల గెలుపొందిన ఎన్డీయే ఎంపీలు, మాజీ ఎంపీలు ఎన్డీయే సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా అనేక మంది పార్లమెంటు సభ్యులు, సీనియర్ నేతలు ఎంపీ బాలశౌరి ఆత్మీయంగా పలకరించారు. మచిలీపట్నం ఎంపీగా వరుసగా రెండోసారి గెలిచాక దాదాపు మూడు నెలల తర్వాత తోటి ఎంపీలను కలుసుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా బాలశౌరి తెలిపారు. అందరి సహకారంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఎంపీ బాలశౌరి కలిసిన వారిలో నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజుజు తదితరులు ఉన్నారు.
మూడోసారి ఎంపీగా ఎన్నికైన బాలశౌరికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. జనసేన తరఫున ఆయనకు కీలక పదవి దక్కే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అన్నీ తానై చూసుకుంటున్నారు.
ఎంపీగా రాజకీయ ప్రస్థానమిలా...
బాలశౌరి 2004లో తొలిసారి తెనాలి లోక్‌సభ స్థానానికి పోటీ చేశారు. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన టీడీపీ అభ్యర్థి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుపై 78వేల 556 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 54.47 శాతం ఓట్ బ్యాంకు సొంతం చేసుకున్నారు.
తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలశౌరి... టీడీపీకి చెందిన అభ్యర్థి కొనకళ్ల నారాయణపై 60వేల 141 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో 46.02 శాతం ఓట్లు బాలశౌరికి పోలయ్యారు.
రెండోసారి మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి జనసేన తరఫున బరిలో నిలిచిన బాలశౌరి.. వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ రావుపై 2లక్షల 23వేల 179 ఓట్ల భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగురవేశారు. నియోజవర్గంలో 7లక్షల 24వేల 439 ఓట్లను దక్కించుకొని మూడోసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
విజయ రహస్యమదే..
సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చిన బాలశౌరి.. మచిలీపట్నంలో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రజలతో మమేకమై, కింది స్థాయి కేడర్ నుంచి నాయకుల వరకు అందరినీ సమన్వయం చేసుకొని మచిలీపట్నంలో జనసేన జెండా ఎగురవేశారు. పార్టీ మారిన మూడు నెలల్లోనే ఎన్నికల్లో పోటీ చేసి 2లక్షల పైచిలుకు మెజారిటీ సాధించారు. ఇదో రికార్డుగా కూటమి నేతలు చెబుతున్నారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేయడం, సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించడమే తన విజయ రహస్యమని బాలశౌరి చెబుతున్నారు.