వదినమ్మ ఇచ్చిన పెన్నుతో పవన్ పవర్ ఫుల్ సంతకం ... ఇదే కదా కోరుకున్నది..!!
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాల మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఇలా బాధ్యతలు తీసుకుంటూ పెట్టిన తొలి సంతకంతోనే అన్నదాతలకు అండగా నిలిచారు.
అమరావతి : పవన్ కల్యాణ్... ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తాను పవర్ స్టార్ అని నిరూపించుకున్నారు. 100 శాతం విన్నింగ్ రేట్ తో పోటీచేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో విజయకేతనం ఎగరేసి... ఒక్కచోట కూడా గెలవలేడని ఎగతాళి చేసినవారితోనే ఒక్కచోట కూడా ఓటమన్నదే లేకుండా గెలిచాడంటూ పొగిడించుకున్నారు. అంతేకాదు టిడిపి, జనసేన, కూటమిని ఒక్కచోటికి చేర్చి వైసిపిని చిత్తుచేయడంలో పవన్ దే కీలక పాత్ర. ఇలా ఏపీ రాజకీయాలను మలుపుతిప్పిన పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. డిప్యూటీ సీఎంగానే కాదు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ప్రజలకు సేవ అందించేందుకు పవన్ సిద్దమయ్యారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పాటే మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ కల్యాణ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ క్యాంప్ ఆఫీసులో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన పండితుల వేదమంత్రోచ్చరణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. చాంబర్ బయట డిప్యూటీ సీఎం అన్న బోర్డు, సీటులో పవన్ కల్యాణ్ హుందాగా కూర్చుని సంతకం చేయడం చూసిన మెగా ఫ్యాన్స్, జనసైనికులకు పూనకాలతో ఊగిపోతున్నారు. ఇటీవలే 'కొణిదల పవన్ కల్యాణ్ అనే నేను' అన్న మాటలు విన్న ఫ్యాన్స్ ఇప్పుడు ఆయన మంత్రిగా సంతకాలు చేస్తుంటే చూసి తరించారు.
వదినమ్మ ఇచ్చిన పెన్నుతోనే తొలి సంతకం :
పవన్ కల్యాణ్ తన అన్నావదినలు చిరంజీవి-సురేఖ దంపతులను కన్న తల్లిదండ్రుల మాదిరిగా చూసుకుంటారు. గతంలో స్టార్ హీరోగా వున్నా... ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మారినా అన్నావదినలపై ప్రేమ ఆయన ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. అయితే చిరంజీవి దంపతులు కూడా పవన్ ను తమ సొంత బిడ్డలాగే చూసుకుంటారు. ఇటీవల ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత పవన్ అన్నావదిన కాళ్లు మొక్కుతూ ఆశీర్వాదం తీసుకున్న వీడియో అందరినీ ఆకట్టుకుంది.
అయితే ప్రమాణస్వీకారం సమయంలో పవన్ కల్యాణ్ సాధారణ ఐదు పదిరూపాయల పెన్నుతో సంతకం చేసారు. ఇది ఆయన సింప్లిసిటీకి నిదర్శనం అయినా తమ అభిమాన నటుడి చేతిలో అలాంటి పెన్ను చూసి అభిమానులు కాస్త నొచ్చుకున్నారు. ఈ విషయం గ్రహించిన చిరంజీవి భార్య సురేఖ మరిదికి ఏకంగా లక్షల విలువచేసే అరుదైన పెన్నును బహుమతిగా ఇచ్చారు. వదినమ్మ అపురూపంతో అందించిన ప్రత్యేకమైన ఆ పెన్నును చూసి పవన్ మురిసిపోయారు.
ఈ సందర్భంగా వదినమ్మ సురేఖ పవన్ ను ఓ కోరిక కోరారు. మంత్రిగా తాను ఇచ్చిన పెన్నుతోనే తొలి సంతకం చేయాలని ఆమె కోరారు. దీంతో తెలుగు ప్రజల ఆకాంక్షలను నిజం చేసే తన అమూల్యమైన సంతకాన్ని వదినమ్మ ఇచ్చిన పెన్నుతోనే చేసారు పవన్. మంత్రిగా కీలక పైళ్లపై తొలి సంతకం స్పెషల్ పెన్నుతో చేసి వదినమ్మకు కోరికను నెరవేర్చారు పవన్.
పవన్ తొలి సంతకం ఈ ఫైళ్లపైనే :
రాజకీయాల్లోకి రాకముందునుండి పవన్ కల్యాణ్ కు వ్యవసాయం, రైతులు, గ్రామీణ ప్రాంతాల పట్ల మక్కువ చూపించేవారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ శివారులో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి వీలుచిక్కినప్పుడల్లా అక్కడికి వెళ్లి స్వయంగా వ్యవసాయ పనులు చేసేవారు. ఇలా పవన్ ఫార్మ్ హౌస్ లో పనులు చేసే ఫోటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇలా రెగ్యులర్ గా కాకున్నా అప్పుడప్పుడయినా వ్యవసాయం చేసే పవన్ కు రైతుల బాధలు తెలుసు.
అయితే రాజకీయాల్లోకి వచ్చాక తన సొంత డబ్బులతో కష్టాల్లో వున్న రైతులకు ఆర్థిక సాయం చేసారు పవన్. ఇలా కౌలు రైతులకు కోట్లాది రూపాయలు పంచిపెట్టారు. అలాగే అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందుకోసమే హోంమంత్రి లాంటి పవర్ ఫుల్ మంత్రిత్వ శాఖలను కాదని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలను ఏరికోరి తీసుకున్నారు పవన్.
అయితే మంత్రిగా బాధ్యతల స్వీకరించే సంతకమే చరిత్రలో నిలిచిపోయే ఫైలుపై పెట్టారు పవన్. ఉపాధి హామీ పథకం వల్ల కూలీల కొరత ఏర్పడుతోందన్న విషయం అందరికీ తెలిసిందే... కానీ దీని గురించి ఏ నాయకుడు ఆలోచించలేదు. కానీ పవన్ అటు ఉపాధి కూలీలకు, ఇటు రైతులకు మేలుచేసే నిర్ణయం తీసుకున్నారు. ఉపాధిహామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులతో అనుసంధానం చేసే ఫైలుపైనే పవన్ తొలిసంతకం చేసారు.
ఇక పంచాయితీరాజ్ శాఖకు సంబంధించిన పైలుపై పవన్ రెండో సంతకం చేసారు. ఇప్పటికీ పలు గిరిజన గ్రామాలు పంచాయితీ భవనాలకు నోచుకోకుండా వున్నాయి. దీంతో గిరిజన గ్రామాల్లో గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణానికి సంబంధించిన ఫైలుపై పవన్ రెండో సంతకం చేసారు. ఇలా పవన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూనే తన మార్కు పాలనను ప్రారంభించారు.
ఆనాడు చెప్పారు... ఈనాడు చేసారు..:
ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలన్నది పవన్ కోరిక. ఈ విషయాన్ని గత ఎన్నికల సమయంలోనే భయటపెట్టారు. 2019 లో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ ఉపాదిహామీ పథకాన్ని వ్వవసాయంతో అనుసంధానం అంశాన్ని జనసేన మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు హామీ ఇచ్చారు. రైతు ఆడపడుచుల విన్నపాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇలా ఇచ్చిన మాటలను పవన్ మరిచిపోలేదని... ఇప్పుడు నిలబెట్టుకున్నారని జనసైనికులు గుర్తుచేస్తున్నారు.