నేరాలను కప్పిపుచ్చుకొనేందుకు వ్యవస్థల్లో చంద్రబాబు మనుషులు: మాచర్ల సభలో జగన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ఏం చేశారని ప్రశ్నించారు.
మాచర్ల: తన నేరాలను కప్పి పెట్టడానికి అనేక వ్యవస్థల్లో చంద్రబాబు నాయుడు తన మనుషులను పెట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. బుధవారంనాడు మాచర్లలో వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.అన్ని పార్టీల్లో కూడ చంద్రబాబు కోవర్టులున్నారన్నారు.
చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదన్నారు. 14 ఏళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మంచి కార్యక్రమమైనా చేపట్టలేదన్నారు. కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.కన్నతల్లికి అన్నం పెట్టనివాడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడా అని ఆయన ప్రశ్నించారు.చంద్రబాబు మారానని చెబితే ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. స్వంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన గుర్తు చేశారు.
చంద్రబాబులాల పొత్తులు పెట్టుకోవడం తనకు చేతకాదని చెప్పారు. తన మాటలను నమ్మడం లేదని తనతో పాటు మరో నలుగురిని వెంటపెట్టుకొని తిరుగుతున్నాడని ఆయన చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మోసాల చరిత్ర, వెన్నుపోటు చరిత్ర చూసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఎన్ని ట్యాబ్లెట్లు , ఇంజెక్షన్లుఇస్తే చంద్రబాబులో మానవత్వం వస్తుందని ఆయన ప్రశ్నించారు.చంద్రబాబు రాజకీయాలు చూస్తే రాజకీయ వ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు.
టీడీపీ, జనసేనల మేనిఫెస్టో పై కూడ జగన్ విమర్శలు చేశారు. ఒకరేమో ఐదు, మరొకరు ఆరు హామీలను మరోసారి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. 2014లో కూడ చంద్రబాబు, బీజేపీ కూటమికి జనసేన మద్దతిచ్చిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. ఈ కూటమి మేనిఫెస్టోను అమలు చేయకపోతే తాను ప్రశ్నిస్తానని చెప్పి ఏం చేశాడన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించినా కూడ పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని ఆయన కోరారు. మరోసారి 11 అంశాలతో ప్రజల వద్దకు టీడీపీ, జనసేన వస్తుందన్నారు.
ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నది చంద్రబాబే అన్నారు. బీసీల తోకలు కట్ చేస్తానని అహంకారంగా మాట్లాడింది చంద్రబాబేనన్నారు. ఎన్నికలు వస్తున్నందున తాను మారానని చంద్రబాబు చెబుతారన్నారు. మంచి జరిగితేనే ఒటేయాలని చెప్పే ధైర్యం తమదని వైఎస్ జగన్ చెప్పారు. ఆ ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఆయన ప్రశ్నించారు.31 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు ఇళ్లు ఇస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
అన్ని వర్గాలకు మంచి చేసినందునే ధైర్యంగా ఓటు అడుగుతున్నట్టుగా జగన్ తెలిపారు.