ఈ నెల 14న సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ: ఆరు అంశాలను ప్రస్తావించాలని ఏపీ నిర్ణయం

సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆరు కీలక అంశాలను ప్రస్తావించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 14న తిరుపతిలో కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.

Andhra Pradesh CM jagan to raise Special Category Status issue at Southern Zonal Council meeting

అమరావతి: సదరన్  జోనల్ కౌన్సిల్  సమావేశంలో ఆరు కీలక అంశాలను ప్రస్తావించాలని ఏపీ సీఎం YS Jaganనిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 14వ తేదీన తిరుపతి వేదికగా  కేంద్ర మంత్రి Amit shah అధ్యక్షతన  సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో రాష్ట్ర విభజన హామీలతోపాటు అపరిష్కృత అంశాలు, పెండింగ్‌ బకాయిల గురించి ప్రధానంగా ప్రస్తావించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

also read:ఈ నెల 9న ఒడిశా టూర్‌కి ఏపీ సీఎం వైఎస్ జగన్: జల వివాదాలపై చర్చ

Southern Zonal Council meeting భేటీలో చర్చకు తేవాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి  సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించి ఆరుకిపైగా అంశాలను ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.

సదరన్‌ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు చర్చకు వచ్చేలా చూడాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌ అంశాలను అజెండాలో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. రూ.6,300 కోట్ల విద్యుత్‌ బకాయిలు, రెవెన్యూ లోటు, రేషన్‌ బియ్యంపై హేతుబద్ధతలేని కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్‌ సప్లయిస్ బకాయిలు, పోలవరం రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఎఫ్‌డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ ప్రస్తావించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి తమిళనాడు నుంచి రావాల్సిన బకాయిలపై కూడా ప్రస్తావించనున్నారు.

నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనల గురించి సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా వీలైనంత త్వరగా సాకారమయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలపై వివరాలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. 

అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. కౌన్సిల్‌ సమావేశంలో ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలుంటే తగిన రీతిలో స్పందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.ఈ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ సహా కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అండమాన్‌ నికోబార్, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్లు, లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ పాల్గొననున్నారు. 

ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎక్స్‌ అషీషియో ప్రిన్సిపల్‌ సెక్రటరీ (స్టేట్‌ రీఆర్గనైజేషన్‌) ఎల్‌.ప్రేమచంద్రారెడ్డి, అటవీ పర్యావరణశాఖ కార్యదర్శి జి.విజయ్‌కుమార్, మత్స్యశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, అదనపు డీజీపీ (లా అండ్‌ ఆర్డర్‌) ఏ.రవిశంకర్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.  


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios