ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న కేసు కొట్టివేయాలని హైకోర్టులో సీఎం జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న కేసు కొట్టివేయాలని హైకోర్టులో సీఎం జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 2014లో హుజూర్ నగర్ ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారని జగన్ పై అభియోగాలు మోపుతూ అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ఇటీవల నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు వైఎస్ జగన్ కు సమన్లు జారీ చేసింది.

ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని సీఎం జగన్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం వైఎస్ జగన్ హాజరుపై ఏప్రిల్‌ 26 వరకు స్టే విధించింది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి.. కాంపిటెంట్ అథారిటీ అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారని అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు వైఎస్ జగన్‌తో పాటు అప్పటి వైసీపీ నాయకులైన జి నాగిరెడ్డి, జి శ్రీకాంత్‌లపై అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన నాంపల్లిలోని ఎమ్మెల్యే, ఎంపీల ప్రత్యేక కోర్టు.. ఇటీవల వైఎస్ జగన్‌తోపాటు నాగిరెడ్డి, శ్రీకాంత్‌లకు సమన్లు జారీచేసింది. మార్చి 28వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సీఎం స్థాయి వ్యక్తికి నాంపల్లి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారి.