ఏలూరు జిల్లాలోని పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఏలూరు జిల్లాలోని పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయవల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఇక, ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. ఐదుగురు ఘటన స్థలంలోనే సజీవ దహనం కాగా.. మరోకరు ఆస్పత్రి తరలిస్తుండగా మృతిచెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. ఇక, మృతుల్లో నలుగురు బిహార్ వాసులు ఉన్నట్టుగా గుర్తించారు. 

అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దీంతో అగ్ని ప్రమాదం జరిగిన కొంతసేపటి తర్వాత మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఏలూరు ఎస్పి, నూజివీడు డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

ఇక, ప్రమాదంలో గాయపడిన వారిని నూజివీడు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.