అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కొందరు టీడీపీ కౌన్సిలర్లను అరెస్ట్ చేశారు.
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్రైనెజీ పనుల విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాట మాట పెరిగి దాడి వరకు చేరింది. ఈ క్రమంలోనే ఇరువర్గాలకు చెందిన కొందరు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పలువురు టీడీపీ కౌన్సిలర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక, ఇటీవల ఏలూరులోని దెందులూరులో పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో పలువురికి గాయాలు అయ్యాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణకు సోషల్ మీడియా పోస్టింగ్స్ కారణంగా తెలుస్తోంది. వివరాలు.. శ్రీరామవరానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో మరో వ్యక్తిని కించపరుస్తూ పోస్టు పెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు పోస్టు పెట్టిన వ్యక్తిపై దాడి చేయాలని భావించారు. ఈ క్రమంలోనే దెందులూరు పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన వ్యక్తిని ముందే స్టేషన్‌కు తరలించారు.
ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ వర్గాలకు చెందినవారు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం కాస్తా.. ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఎస్‌ఐ వీర్రాజుతోపాటు ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలు అయ్యాయి. అయితే పరిస్థితి అదుపుదాటడంతో.. ఏలూరు డీఎస్పీ పైడేశ్వరరావు నియోజకవర్గంలోని ఎస్‌ఐలు, ఏలూరు నగరంలోని సీఐలతో దెందులూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. శ్రీరామవరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించారు.
