టీడీపీ ఖాతాలోకి ఆ నిధులెలా వచ్చాయి: ఏపీ సీఐడీ నోటీసులు
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. టీడీపీ ఖాతాల్లోకి వచ్చిన నిధుల గురించి వివరాలను ఇవ్వాలని ఆ నోటీసులో కోరారు సీఐడీ అధికారులు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు మంగళవారంనాడు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం (టీడీపీ) బ్యాంకు ఖాతాల వివరాలు అందించాలని ఆ నోటీసులో సీఐడీ కోరింది.తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి ఆశోక్ బాబుకు సీఐడీ కానిస్టేబుల్ నోటీసు ఇచ్చి వెళ్లారు.ఈ నెల 18వ తేదీలోపుగా వివరాలు ఇవ్వాలని ఆ నోటీసులో కోరారు.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసు కేసుకు సంబంధించి టీడీపీ ఖాతాకు వచ్చిన వివరాలు కావాలని సీఐడీ ఆ నోటీసులో కోరింది. తెలుగుదేశం పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాల వివరాలను ఇవ్వాలని కోరింది. అంతేకాకుండా టీడీపీకి వచ్చిన విరాళాలను కూడ అందించాలని ఆ నోటీసులో తెలిపింది. తెలుగుదేశం పార్టీకి అందిన విరాళాల గురించి ఏపీ సీఐడీ ప్రశ్నించడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సీఐడీ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసులను కూడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి తీసుకురావాలని ఆ పార్టీ భావిస్తుంది.ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిని ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఈ ఏడాది అక్టోబర్ 31న చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈ నెల 28వ తేదీ వరకు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఈ నెల 28వ తేదీన సాయంత్రం లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ ఖాతాలోకి వచ్చిన నిధుల విషయమై సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో రానున్న రోజుల్లో ఈ కేసు దర్యాప్తు తీరుపై ఉత్కంఠ నెలకొంది.
చంద్రబాబుపై ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు కాకుండా , ఏపీ ఫైబర్ నెట్ కేసు, అంగళ్లు కేసు, మద్యం తయారీ కంపెనీల అనుమతుల విషయంలో అక్రమాలపై , ఇసుక విధానంలో అక్రమాలు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు పై కేసులు నమోదైన విషయం తెలిసింది.
also read:ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 15 వ తేదీకి వాయిదా
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఈ వారంలో సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.