అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు ఉదయం పదిన్నర గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదిక పై ప్రధానం గా చర్చ జరగనుంది.

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామాల రైతులు పది రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు.ఈ తరుణంలో ఈ కేబినెట్ కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై కేబినెట్ లో చర్చిస్తారు. రైతుల ఆందోళన, సీఆర్డీఏ వ్యవహారాల పైనా క్యాబినెట్ లో చర్చించి ఓ నిర్ణయాన్ని వెలువరిచే అవకాశం ఉంది.

రాజధాని రైతుల అభిప్రాయాల సేకరణ కు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్నూలులో వెటర్నరీ పాలిటెక్నిక్ ఏర్పాటు పై కేబినెట్ లో చర్చ సాగుతుంది.ప్రస్తుతం ఎంఎస్పీ వర్తిస్తున్న పంటలు మినహా ఇతర పంటలకు మద్దతు ధర కల్పించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.

ఏపీఐఐసి ద్వారా వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.సీఆర్డీఏ ప్రాంతంలో ఐఏఎస్ అధికారులు కొనుగోలు చేసిన ప్లాట్లకు సంబంధించి డబ్బులు తిరిగి చెల్లించే అంశంపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు. 

మందడంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ మందడంలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం ఉన్నందున సచివాలయానికి వెళ్లే రహదారిపై ఆందోళన కొనసాగించబోమని ఇదివరకే రైతులు పోలీసులకు హామీ ఇచ్చారు. రోడ్లపై వేసిన టెంట్లను పోలీసులు తీసివేయించారు.

మందడం, మల్కాపురం జంక్షన్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యాన్‌ వాహనాలతో పాటు అగ్నిమాపక దళాల మోహరించారు. రాజధాని గ్రామాల్లో గుర్తింపు కార్డులు ఉంటేనే అనుమతి ఇస్తున్నారు పోలీసులు.

 సచివాలయం వెళ్లే ప్రధాన రహదారి కావటం తో మందడం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇవాళ రహదారిపై మహాధర్నాను కొనసాగించాలని రైతులు నిర్ణయం తీసుకొన్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెం లో కొనసాగనున్న 10వ రోజు రిలే నిరాహారదీక్షలు చేరుకొన్నాయి.


కన్నా లక్ష్మీనారాయణ నేడు మౌన దీక్ష

ఉద్దండరాయిని పాలెం శంకుస్థాపన ప్రదేశంలో ఉదయం నుంచి రైతులతో కలిసి మౌన దీక్ష చేయాలని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయం తీసుకొన్నారు. ప్రతి గ్రామంలో కూడ రైతులు నిరసన కార్యక్రమాలను కొనసాగించనున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆందోళనలను కొనసాగిస్తున్నాయి విపక్షాలు.

ఇవాళ కేబినెట్ లో రాజధానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాజధాని రైతులకు సంతోషం కల్గించేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొంటారని వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు గురువారం నాడే స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో రాజదానిని అమరావతిలో ఉంచే ఉద్దేశ్యం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వానికి ఉందని రాజధాని రైతులు చెబుతున్నారు.