అమరావతి: ఈ నెల 22వ తేదీన ఏపీ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో వారి స్థానంలో కొత్త మంత్రులతో భర్తీ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు.ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.22వ తేదీ మధ్యాహ్నం 1.29 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ నెలకొని ఉంది.

డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవులతో పాటు, మంత్రి పదవులకు కూడ వీరిద్దరూ రాజీనామా చేశారు. 

పిల్లి సుభాష్ చంద్రబోస్. మోపిదేవి వెంకటరమణలు ఇద్దరూ కూడ బీసీ సామాజిక వర్గానికి చెందినవారే.శాసనమండలిని రద్దు చేయాలనే ఉద్దేశ్యంతో మండలి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న వీరిద్దరిని రాజ్యసభకు పంపారు జగన్.

జూన్ 19వ తేదీన జరిగిన ఎన్నికల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవులకు, మంత్రి పదవులకు ఈ నెల 1వ తేదీన రాజీనామా చేశారు.

ఈ నెల 21వ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. దీంతో ఈ నెల 22 వ తేదీన మధ్యాహ్నం మంత్రివర్గాన్ని సీఎం జగన్ విస్తరించనున్నారని సమాచారం. ఈ విషయమై అధికారులకు ఏర్పాట్లు చేయాలని సమాచారం వెళ్లినట్టుగా తెలుస్తోంది. . పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల సామాజిక వర్గాలకు చెందినవారికే ఈ దఫా మంత్రివర్గంలో చాన్స్ దక్కే అవకాశం ఉందంటున్నారు. మరో వైపు ఈ రెండు పోస్టుల కోసం పలువురు ఆశావాహులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

మరో ఏడాదిన్నర దాటితే మరోసారి జగన్ మంత్రివర్గాన్ని విస్తరించనే అవకాశం లేకపోలేదు. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రుల పనితీరును సమీక్షించి కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. ఇప్పుడు ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కనుంది. కేబినెట్ లో చాన్స్ దక్కాలంటే మరో ఏడాదిన్నర వరకు ఆగాల్సిందే.

గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధులను కూడ నామినేట్ చేయాలని ప్రభుత్వం ఇద్దరి పేర్లను సోమవారం లేదా మంగళవారం నాడు సిఫారసు చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిన వారికి మంత్రి పదవిని కల్పిస్తారా అనే చర్చ కూడ లేకపోలేదు.