ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మరికాసేపట్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్.. సోషియో ఎకనామిక్ సర్వేను విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మరికాసేపట్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్.. సోషియో ఎకనామిక్ సర్వేను విడుదల చేశారు. సామాజిక, ఆర్థిక సర్వే 2021-22 జీఎస్డీపీలో వృద్ది రేటు బాగా పెరిగిందని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ది సాధించడంతో ఏపీ దేశ సగటు రేటు దాటిందని తెలిపారు. దేశ ప్రగతి రేటు కంటే ఏపీ ప్రగతి రేటు ఎక్కువ అని చెప్పారు.
వ్యవసాయ రంగంలో 14.5 శాతం ప్రగతి నమోదు అయిందని విజయ్ కుమార్ వెల్లడించారు. పరిశ్రమల రంగంలో 25.5 శాతం, సేవా రంగంలో 18.9 శాతం ప్రగతి నమోదు అయిందని తెలిపారు. తలసరి వృద్దిరేటు కూడా రూ. 31 వేలు పెరిగి.. 17.5 శాతం పెరిగిందని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాల్లో ప్రగతి రావడంతో సుస్థిరాభివృద్ది పెరిగిందని తెలిపారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి శుక్రవారం ఉదయం సమావేశం అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాకులో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2022-23 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం ఉదయం 10.15 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయానికి మండలిలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి బడ్జెట్ చదవనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తి అయిన వెంటనే శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు ప్రవేశపెట్టనున్నారు.
ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఉదయమే సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలోని ఆర్థిక మంత్రి కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. వ్యవసాయం, మహిళా సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ఎక్కువ నిధులు ఉంటాయన్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను నిధులు కేటాయించం అని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకిచ్చిన హామీల అమలు దిశగా బడ్జెట్ రూపొందించామని చెప్పారు.
