పరిశ్రమల ఆవిష్కరణ, అవస్థాపన సౌకర్యాల కల్పన, లింగ సమానత్వం తదితర విభాగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏపీ అధిగమించింది. ఈ అన్ని విభాగాల్లో  జాతీయ స్థాయిలో నీతి ఆయోగ్ రూపొందించిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. 

 అభివృద్ధిలో 64 శాతం మార్కులతో ఏపీ నాలుగో స్థానంలో నిలవగా, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌లు 69 మార్కులతో తొలి రెండు స్థానాల్లోనూ, 66 మార్కులతో తమిళనాడు మూడో స్థానంలో నిలిచాయి. దేశ సగటు 57 శాతం కాగా, తెలంగాణ 61 శాతం స్కోరు సాధించింది. ఈ విభాగంలో యూపీ, బిహార్, అస్సాంలు అట్టడుగున నిలిచాయి.

 ‘ప్రపంచాన్ని మార్చడానికి 17 లక్ష్యాలు’ అనే పేరుతో నీతిఆయోగ్ ఓ నివేదికను రూపొందించింది. పూర్తిస్థాయిలో పేదరికం నిర్మూలనం, ఆకలి బాధలు, మంచి ఆరోగ్యం- శ్రేయస్సు, నాణ్యమైన విద్య, లింగసమానత్వం, స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం, సరయైన శక్తి, పనితీరు, ఆర్థికవృద్ధి, పరిశ్రమల ఆవిష్కరణ, అవస్థాపన సౌకర్యాలు, అసమానతల తగ్గింపు, స్థిరమైన నగరాలు, బలమైన సమాజం, శాంతి, న్యాయం, జీవన ప్రమాణం, భూములు, బలమైన సంస్థలు తదితర విభాగాల్లో పనితీరును ప్రామాణికంగా తీసుకుని నీతి ఆయోగ్ ఈ నివేదికను రూపొందించింది. 

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రామాణికతల ఆధారంగా ర్యాంకులను కేటాయించింది. నీతి ఆయోగ నిర్దేశించిన లక్ష్యాల్లో ఏపీ పదమూడు విభాగాల్లో ప్రామాణికాలను అందుకుంది. పేదరిక నిర్మూలన, ఆరోగ్య ప్రమాణాలు, విద్య, శక్తి, పనిలో నైపుణ్యం, అసమానతల తగ్గింపు, జీవ ప్రమాణం, భూమి, శాంతి, న్యాయం, శక్తివంతమైన సంస్థల విభాగంలో ఏపీ సత్తా చాటింది. అయితే, లింగసమానత్వం, పరిశ్రమల ఆవిష్కరణ, అవస్థాపన సౌకర్యాలు, స్థిరమైన నగరాలు, సమాజం విభాగాల్లో మాత్రం తక్కువ స్కోరు సాధించింది.