అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దిశ చట్టంపై మంగళవారం నాడు ఆసక్తికర చర్చ సాగింది. ఈ విషయమై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకొన్నాయి. 

మంగళవారం నాడు  ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో  టీడీపీ శాసనసభపక్ష ఉప నాయకుడు అచ్చెన్నాయుడు ఈ విషయమై ప్రశ్నించారు. దిశ చట్టంలో లోపం ఉంది, దాన్ని సరిచేయమని కోరుతోంటే అధికారపక్షం ఎదురు దాడికి దిగుతోందని అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రస్తావించారు.

అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు ఏపీ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. దిశ బిల్లు చేసి చట్టం ఇంకా అమల్లోకి రాలేదని బుగ్గన రాజేంద్రనాథ్‌ గుర్తు చేశారు. దిశ చట్టంలోనే లోపం ఉంది. కాబట్టి ఏదో జరుగుతోందని అనటం ఏంటని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి టీడీఎల్పీ ఉప నాయకుడు అచ్చెన్నాయుడుకు కౌంటరిచ్చారు. 

సభా వ్యవహారాలు ఏదో తెలియని వాళ్లు మొదటిసారి సభకు వచ్చిన వారు మాట్లాడుతున్నారంటే అర్థం ఉంటుందని బుగ్గన ఎద్దేవా చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్ష నాయకుడు కూడా అదే చెప్పటంపై బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే  తమ ప్రభుత్వంపై బురదచల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.

Also read:ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

ఈ విషయమై  ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకొన్నారు.గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వాలు మంచి చట్టాలు ప్రజల కోసం తయారు చేస్తున్నాయన్నారు. జరుగుతున్న సంఘటనలు అన్నీ చట్టాలు లేకుండా జరుగుతున్నాయా అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు.

Also read:ఆ నాయుడు మీ చుట్టం కాదా, అన్నీ బయటపెడతాం: చంద్రబాబుపై జగన్

దిశ చట్టం నిన్నగాక మొన్న చట్టం అయింది. ఎందుకు గాబరా పడుతున్నారని ప్రతిపక్షాలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ప్రభుత్వాలు మంచి ఉద్దేశంతోనే చట్టాలు తయారు చేస్తాయన్నారు. ప్రతిపక్షాల సూచనలను  హోంమంత్రి  నోట్‌ చేసుకొని వాటిని పరిగణలోకి తీసుకోవాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం సూచించారు.