ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్తంగా సాగుతున్నాయి. తాము బలపడటమే కాదు ప్రత్యర్థులను బలహీనపర్చేందుకు ప్రధాన పార్టీలన్ని వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇలా గతంలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను తెరపైకి తెచ్చి పవన్ ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది వైసిపి. 

అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదయ్యింది. వాలంటీర్ వ్యవస్థపై గతంలో చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం గుంటూరు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పవన్ పై ఐపిసి 499, 500 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అంతేకాదు తదుపరి విచారణకు కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ పవన్ కు నోటీసులు జారీచేసింది న్యాయస్థానం. 

గతంలో వాలంటీర్ వ్యవస్థపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ లకు వాలంటీర్లు కూడా ఓ కారణమని పవన్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి వివరాలను వాలంటీర్లు సేకరిస్తున్నారని... ఈ సమాచారం పక్కదారి పడుతున్నట్లు ఆరోపించారు. నిరుపేద, ఒంటరి మహిళల వివరాలు సంఘవిద్రోహ శక్తులకు చేరుతున్నాయని పవన్ అన్నారు. వాలంటీర్లు అందించే సమాచారం వీరి చేతికి చేరడానికి కొందరు ప్రభుత్వ పెద్దలు, వైసిపి నేతలే కారణమన్నారు. దీంతో రాష్ట్రానికి చెందిన 30వేల మందికిపైగా అమ్మాయిలు కనిపించకుండా పోయారని తెలిపారు. మహిళల మిస్సింగ్ వ్యవహారం గురించి కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పాయని పవన్ పేర్కొన్నారు.

వాలంటీర్లు, ప్రభుత్వం, వైసిపి నాయకులపై పవన్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. పవన్ కు వ్యతిరేకంగా వాలంటీర్లు ఆందోళనకు దిగడమే కాదు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసారు. అలాగే ప్రభుత్వం కూడా పవన్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. దీంతో గుంటూరు కోర్టులో ఈ వ్యవహారంపై పిటిషన్ దాఖలుచేయగా విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా పవన్ పై క్రిమినల్ కేసుకు ఆదేశించింది. మార్చి 25న జరిగే విచారణకు పవన్ హాజరై తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. 

Also Read ఆంబోతుల మాదిరిగా పడ్డారు.. నేనూ, పవన్ కళ్యాణ్‌ వైసీపీ బాధితులమే : చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

అయితే తాజాగా వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై పవన్ వివరణ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం వక్రీకరించిందని పవన్ తెలిపారు. వాలంటీర్లే రాష్ట్రంలోని మహిళల అదృశ్యానికి కారణమని తాను అనలేదు... వీరి ద్వారా వైసిపి ప్రభుత్వం డేటాను సేకరించి ఎవరిచేతికో ఇచ్చిందని అన్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆదేశాలతో వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం పక్కదారి పడుతోందని... తద్వారా నేరాలు జరిగే ఆస్కారం వుందని చెప్పడమే తన ఉద్దేశ్యమన్నారు. అలాగే కొందరు వాలంటీర్లు చేసే పనులు మొత్తం వాలంటీర్ వ్యవస్థకే చెడ్డపేరు తెస్తోందని హెచ్చరించానన్నారు. వాలంటీర్ వ్యవస్థమీద తనకు గౌరవం వుందని పవన్ తెలిపారు.

రాష్ట్రంలో 33 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని చెబితే ప్రభుత్వం పట్టించుకోలేదు... వైసిపి నాయకులు తనపై విరుచుకుపడ్డారని పవన్ గుర్తుచేసారు. కానీ కేంద్ర ప్రభుత్వమే సాక్షాత్తూ పార్లమెంటులో మహిళల అదృశ్యం నిజమేనని తేల్చిందన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ కూడా మహిళలు అదృశ్యం మాట నిజమేనని ఒప్పుకున్నారు... ఆలస్యంగా అయినా తాను చెప్పింది నిజమేనని ఒప్పుకున్నందుకు సంతోషమని పవన్ అన్నారు.