దేవుడి ప్రసాదం ఎవరైనా పెడితే కాదని అంటామా..?  మనకు తెలియని వాళ్లైనా ప్రసాదం పెడితే... కళ్లకు అద్దుకొని తీసుకుంటాం. కానీ... ఈ న్యూస్  చదివిన తర్వాత ప్రసాదం తీసుకోవడానికి  కూడా చాలా మంది ఆలోచిస్తారు. ఎందుకంటే.... ఓ వ్యక్తి కేవలం ప్రసాదం పెట్టి పది మందిని చంపేశాడు. భక్తి పేరిట వారి నమ్మించి.. ప్రసాదంలో సైనేడ్ కలిపి ఒకరు కాదు.. ఇద్దరు కాదు... ఏకంగా పది మందిని చంపేశాడు. కాగా... ప్రస్తుతం ఆ నరరూప రాక్షసుడిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే....ఏలూరు వెంకటాపురం పంచాయతీలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి అలియాస్‌ శివ వాచ్‌మ్యాన్‌ నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా మారాడు. అయితే... ఆ వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో... అప్పటి నుంచి దానిని వదిలేసి మరో అవాతారం ఎత్తాడు.

ప్రజల నమ్మకాలను తనకు సొమ్ముగా  చేసుకోవాలని భావించాడు. రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌, రంగురాళ్లు, గుప్త నిధులు, బంగారం రెట్టింపయ్యే మార్గం అంటూ.. బాగా డబ్బున్న వారిపైన, అప్పుల నుంచి బయటపడాలనుకునే వారిపైనా కన్నేశాడు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన షేక్‌ అమానుల్లా అలియాస్‌ బాబు అలియాస్‌ శంకర్‌ (61)ను కలుపుకొన్నాడు. మోటారు వాహనాల విడి భాగాలకు నికెల్‌ కోటింగ్‌ వేసే శంకర్‌ వద్ద సైనైడ్‌ ఉంది.  ఆ సైనేడ్ ని ప్రసాదంలో కలిసి తనను పూర్తిగా నమ్మినవాళ్లకు ఇచ్చేవాడు. అలా ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు తీశాడు.

ఒక్కోక్కరిని ఒక్కోలా నమ్మించేవాడు. వాళ్లకి ఏదంటే నమ్మకం, ఆశ ఉంటుందో వాటినే చెప్పి నమ్మించేవాడు. తన స్వార్థానికి వాళ్లని బలిచేసేవాడు. సొంత బంధువులను కూడా అతను బలితీసుకోవడం గమనార్హం. గోదావరి జిల్లా రాజమండ్రి పేపర్‌మిల్లు వద్ద ఉంటున్న కొత్తపల్లి రాఘవమ్మ వద్దకు చుట్టపు చూపుగా శివ వెళ్లాడు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న రాఘవమ్మను ఆయుర్వేదంతో బాగుచేస్తానని నమ్మించాడు. ఆమెకు ఇచ్చే మందుల్లో సైనైడ్‌ కలిపి చంపేశాడు. 

ఆమె ఇంట్లోంచి లక్ష రూపాయలకుపైగా నగదులో ఉడాయించాడు. ఇదే జిల్లా బొమ్మూరులో ఉంటున్న వరసకు వదిన అయ్యే సామంతకుర్తి నాగమణిని కూడా ఇలాగే హత్యచేసి, ఐదులక్షల డబ్బులు, నగలుతో పరారయ్యాడు. ఏలూరులో తాను అద్దెకుంటున్న రాములమ్మ వద్ద ఉన్న బంగారం, వెండి వస్తువులు, నగదుపై కన్నేసి.. ఆమెనూచంపేశాడు.

గుప్త నిధుల జాడ చూపుతానని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి మరికొందరిని హతమార్చాడు. చివరికి...అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద మందు అంటూ ఒక స్వామీజీని కూడా సైనైడ్‌తో చంపేశాడు. తర్వాత అక్కడి నుంచి తన ముఠాతో పరారయ్యేవాడు. చివరకు పోలీసులకు చిక్కిపోయాడు. కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.