20 నుంచే విశాఖలో కార్యకలాపాలు: సచివాలయ తరలింపుకు ఏర్పాట్లు, రిపబ్లిక్ డే పరేడ్ అక్కడే..?
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తోన్న వైఎస్ జగన్ సర్కార్ ఇందుకు సంబంధించి పనులను వేగవంతం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తోన్న వైఎస్ జగన్ సర్కార్ ఇందుకు సంబంధించి పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ, బీసీజీలు ఇచ్చిన నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తోంది.
ఈ క్రమంలో ఏపీ సచివాలయ కార్యకలాపాలను విశాఖకు తరలించాలని సర్కార్ భావిస్తోంది. దీనిలో భాగంగా ఈ నెల 20 విశాకలో తాత్కాలిక కార్యకలాపాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. విడతల వారీగా సచివాలయం తరలించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.
Also Read:జగన్‌కు షాక్: అమరావతి రైతుల ఆందోళన, వాస్తవాలు ఇవీ..
ప్రాధాన్యత శాఖల్లో కీలక విభాగాలను ఆన్ డ్యూటీ కింద తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
జీఏడీ నుంచి మూడు సెక్షన్లు, ఆర్ధిక శాఖ నుంచి రెండు సెక్షన్లు, మైనింగ్ నుంచి రెండు, హోంశాఖ నుంచి నాలుగు సెక్షన్లు, రోడ్లు భవనాల నుంచి నాలుగు సెక్షన్లు, పంచాయతీ రాజ్ నుంచి నాలుగు సెక్షన్లు, వైద్య ఆరోగ్య శాఖ, ఉన్నత విద్య, పాఠశాల విద్యా శాఖ నుంచి రెండేసి సెక్షన్లను తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మొత్తం 34 శాఖల నుంచి కీలక విభాగాలను తరలించేందుకు ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది. అయితే సచివాలయాన్ని విశాఖకు తరలించడంపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రభుత్వం న్యాయపరంగా చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. అదే సమయంలో విశాఖలోనే రిపబ్లిక్‌డే పరేడ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది.
Also Read:జగన్ దూకుడు: బాబుకు ఇలా చెక్, వ్యూహమిదీ...
మరోవైపు మంగళవారం జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ ఎల్లుండికి వాయిదా పడింది. కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడం కారణంగానే రేపటి భేటీ వాయిదా పడింని ప్రభుత్వం వెల్లడించింది. ఈ కమిటీకి ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు.